Rahul Gandhi: నమ్మిన ప్రజలను మోసం చేసిన మోదీ... ఒక్కసారి తనను నమ్మాలన్న రాహుల్ గాంధీ!
- నరేంద్ర మోదీ లక్ష్యంగా రాహుల్ విమర్శలు
- విభజించి పాలించాలన్న సిద్ధాంతంలో మోదీ
- అభివృద్ధి చేసే సత్తా కాంగ్రెస్ దే నన్న రాహుల్
నరేంద్ర మోదీని నమ్మిన ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వగా, ఆయన దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న రాహుల్, మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ, నమ్మిన ప్రజలను మోదీ మోసం చేశారని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తనను నమ్మాలని కోరారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి మహాత్మాగాంధీ ఎంతో కృషి చేస్తే, ఇప్పటి ప్రధాని విభజించి పాలించాలన్న సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.
"మీరు మోదీకి మద్దతిచ్చారు. ఆయన మీ నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని, మహాత్మా గాంధీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లి దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా ఉన్న కాంగ్రెస్ ను నమ్మండి" అని ఆయన వ్యాఖ్యానించారు. రాఫెల్ డీల్ ను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థను వదిలేసి, అంబానీల సంస్థను ఎంచుకోవడం వెనకున్న కారణం ఏంటో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు.