Kiran Bedi: స్వచ్ఛ భారత్‌లో ఉద్రిక్తత.. గెటవుట్ అంటూ కేకలు వేసుకున్న గవర్నర్ కిరణ్ బేడీ-ఎమ్మెల్యే!
- ప్రభుత్వంపైనా, గవర్నర్ పైనా ఎమ్మెల్యే విమర్శలు
- మైక్ కట్ చేసిన గవర్నర్
- వేదికపై కేకలు వేసుకున్న గవర్నర్-ఎమ్మెల్యే
పుదుచ్చేరిలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం రసాభాసగా మారింది. గవర్నర్ కిరణ్ బేడీ-అన్నాడీఎంకే ఎమ్మెల్యే అన్బగళన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. గెటవుట్ అంటే గెటవుట్ అనుకునేంత వరకు వెళ్లింది. దీంతో కార్యక్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
గవర్నర్ కిరణ్ బేడీ ఆధ్వర్యంలో మంగళవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యే అన్బగళన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, ఆహ్వాన పత్రికలో తన పేరు లేకపోవడాన్ని నిరసిస్తూ మంత్రి, ఎంపీతో గొడవపడ్డారు. దీంతో వారు ఎమ్మెల్యేకు నచ్చజెప్పి వేదికపైకి తీసుకెళ్లి మాట్లాడే అవకాశం కల్పించారు.
అనంతరం అన్బగళన్ మాట్లాడుతూ కేంద్రంపైనా, గవర్నర్‌పైనా తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ప్రసంగాన్ని ముగించాలంటూ అన్బగళన్‌కు గవర్నర్ ఓ చీటీ పంపారు. అయినా, ఆయన పట్టించుకోకుండా మాట్లాడుతుండడంతో గవర్నర్ లేచి ప్రసంగం ముగించాలని కోరారు. అయినప్పటికీ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండడంతో మైక్ కట్ చేయించారు.
మైక్ కట్ చేయడాన్ని అవమానంగా భావించిన ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోతూ గవర్నర్‌తో వాదనకు దిగారు. గవర్నర్ కూడా ఏమాత్రం తగ్గకుండా వేదిక దిగి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో అన్బగళన్‌కు కోపం నషాళానికి ఎక్కింది. ‘‘ఇది మా రాష్ట్రం. ఫస్ట్ యూ గో’’ అని మండిపడ్డారు. స్పందించిన గవర్నర్ సభా మర్యాద తెలియని నీవే తొలుత వేదిక దిగాలని హెచ్చరించారు. గొడవ పెద్దదవుతుండడంతో ఎంపీ రాధాకృష్ణన్, మంత్రి నమశ్శివాయ కలగజేసుకుని ఇద్దరికీ సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.