Revanth Reddy: నేడు ఐటీ విచారణకు రేవంత్ రెడ్డి.. ‘ఓటుకు నోటే’ ప్రధాన అజెండా!
- నేడు 10:30 గంటలకు విచారణకు హాజరు
- ఆ రూ.50 లక్షల గురించే ప్రధానంగా ప్రశ్నలు
- సెబాస్టియన్, ఉదయ సింహ, కొండల్‌రెడ్డిలను కూడా విచారించే అవకాశం
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేడు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లో ఇటీవల సోదాలు జరిపిన అధికారులు మూడో తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు నేడు 10:30 గంటలకు ఆయన విచారణకు హాజరు కానున్నారు. విచారణ మొత్తం ‘ఓటుకు నోటు’ కేసు చుట్టూనే తిరిగే అవకాశం ఉందని సమాచారం. ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌కు ఇవ్వాలని భావించిన రూ.50 లక్షల గురించే ప్రధానంగా విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది.
సోమవారం ఇదే కేసులో సెబాస్టియన్, ఉదయసింహ, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, ఆయన మామ పద్మారెడ్డిలను అధికారులు విచారించారు. నేడు రేవంత్‌ను విచారించనున్న అధికారులు సెబాస్టియన్, ఉదయ సింహ, కొండల్‌రెడ్డిలను మరోమారు విచారించనున్నారు.