Pawan Kalyan: నాలుగేళ్ల కాలంలో అప్పులు చేయడంలో అభివృద్ధి చూపించారు: చంద్రబాబుపై పవన్ సెటైర్లు
- ఇకనైనా అప్పులు చేయడం ఆపండి
- వాటిని మీరు తీరుస్తారా? లోకేశ్ తీరుస్తారా?
- 21 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి
- జంగారెడ్డిగూడెం బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు
ఈ నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పులు చేయడంలోనే అభివృద్ధి చూపించారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జంగారెడ్డిగూడెంలో ఈరోజు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు రూ.55వేల కోట్లు ఉన్న అప్పు కాస్తా ఇప్పుడు రూ.లక్ష 55వేల కోట్లకు చేరిందని అన్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేస్తానని చెప్పి అప్పుల కోసం తిరగడం సరికాదని అన్నారు.
‘అమెరికా వెళ్ళిన చంద్రబాబు అక్కడ అప్పుల కోసం తిరిగారు. పాలేకర్ లాంటివారు సేంద్రీయ వ్యవసాయం గురించి చెబుతారు. వారి దగ్గర నేర్చుకోండి. లేదా మసనోబు ఫుకౌకా రాసిన ‘గడ్డిపరకతో విప్లవం’ పుస్తకం చదివితే ప్రకృతి వ్యవసాయం గురించి తెలుస్తుంది. ఆ సాగు పేరుతో అప్పులు ఎందుకు? ఇకనైనా అప్పులు చేయడం ఆపండి. ఈ రుణాలను మీరు తీరుస్తారా? మీ అబ్బాయి లోకేశ్ తీరుస్తారా? ఈ ప్రాంతంలో పామాయిల్, పొగాకు రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక ఇబ్బంది పడుతున్నారు. ‘జనసేన’ త్వరలో రైతు సమస్యలపై విజయవాడలో సదస్సు నిర్వహించబోతోంది. అందులో రైతాంగం కష్టాలు, గిట్టుబాటు ధర కల్పించడం, సాగు లాభసాటిగా చేయడంపై చర్చిస్తాం.జంగారెడ్డిగూడెం ప్రాంతంలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. మంత్రి లోకేశ్ మాత్రం 14 వేల కిమీ రోడ్లు వేశాం అంటారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాల్లో తిరిగితే ఏదో కొండలు, లోయల్లో ప్రయాణించినట్లు ఉంది. జంగారెడ్డిగూడెంకి 14 కిమీ దూరంలోని నరసింహస్వామి ఆలయానికి నిన్న తెల్లవారుజామున వెళ్ళాను. ట్రాఫిక్ కూడా లేదు. 45 నిమిషాలు పట్టింది అంటే రోడ్లు ఎంత దెబ్బతిని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి, లోకేశ్ గారు చెప్పిన 14 వేల కిమీ రోడ్లు ఎక్కడ? టీడీపీ నాయకులు తిరిగే చోటే వేసుకుంటున్నారా? ఇక్కడి కంటే తెలంగాణలోని రోడ్లు కాస్త మెరుగ్గా ఉన్నాయి. మొన్న మా సెక్యూరిటీ సిబ్బందికి ఒకరికి గాయం అయితే ఆసుపత్రికి తీసుకు వెళ్ళి మెరుగైన వైద్యం చేయించమంటే అయితే ఏలూరు గానీ, విజయవాడ గానీ తీసుకువెళ్లాలి అని చెప్పారు. కనీసం ఇక్కడ అంబులెన్స్ సదుపాయం కూడా లేదు. ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూదీ, సిరెంజీలు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి.
మరి ఎన్నికల వేళ జంగారెడ్డిగూడెంలో 100 పడకల ఆసుపత్రి కట్టిస్తాం అని ఇచ్చిన హామీ ఏమైపోయింది? కొయ్యలగూడెంలో 2014 ఎన్నికలకి ముందు హడావిడిగా పాలిటెక్నిక్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ సరైన భవనం కట్టలేకపోయారు. ఇక్కడ ఎంపీగా చేసిన కావూరి సాంబశివరావు ఏం అభివృద్ధి చేశారు? ఇప్పుడున్న ఎంపీ మాగంటి బాబు ఏమి సాధించారు?
దెందులూరు రౌడీ ఎమ్మెల్యేకి చింతలపూడి నియోజకవర్గంలో ఏమి పని? కొయ్యలగూడెం ప్రాంతంలో అటవీ భూములు ఆ రౌడీ ఆక్రమించేసినా ప్రభుత్వం ఏమీ మాట్లాడటం లేదు. ఈ ప్రాంతం వాసులకి ఎదిరించే ధైర్యం లేదా? ముఖ్యమంత్రిని అడిగితే విచారణ కమిటీ వేస్తాం అంటారు. వేసి ఏం చేస్తారు? వైజాగ్ భూ కుంభకోణాలపై వేశారు. ఏమీ ఫలితం రాలేదు. ఇలా కబ్జాలు చేసే వారిని నిరోధించాలి.
చింతలపూడి ఎత్తిపోతల పథకానికి భూములు ఇచ్చిన రైతులకి అన్యాయం చేస్తున్నారు. కొందరికి రూ.10 లక్షలు ఇస్తే... తమవారికి మాత్రం రూ.50 లక్షల వరకూ పరిహారం ఇచ్చారు. ఈ వివక్ష ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ విషయంలోనూ ముఖ్యమంత్రి నిర్వాసితుల గురించి ఆలోచించాలి. ఆయనకి అమరావతి మాత్రమే కనిపిస్తోంది. జాతీయ ప్రాజెక్ట్ పోలవరానికి భూములు, ఇళ్ళు, ఉన్న ఊరు త్యాగం చేస్తున్న నిర్వాసితులకి అందరం రుణపడి ఉంటాం.
వారికి మెరుగైన మంచి జీవితం వచ్చే వరకూ ‘జనసేన’ అండగా ఉంటుంది. వారికి పరిహారం, పునరావాసం విషయంలో ముఖ్యమంత్రి శ్రద్ధ చూపాలి. నిర్వాసితుల కన్నీళ్లపై కాకుండా వారి ఆనందబాష్పాలపై పోలవరం పూర్తి కావాలి అని ‘జనసేన’ ఆకాంక్షిస్తుంది. ఆ దిశగా ‘జనసేన’ ప్రయత్నిస్తుంది. అమరావతి బాండ్ల తరహాలోనే పోలవరం బాండ్లు తెచ్చి… నిర్వాసితులకి ఎంత బాకీపడి ఉన్నామో ఒక పత్రం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది’ అని అన్నారు.
రాబోయే మూడేళ్లలో రాజకీయాల్లో అనూహ్య మార్పులు
రాబోయే ఎన్నికల్లో ఒక్కో నియజకవర్గానికి రూ.25 కోట్లు ఖర్చు చేసి గెలవాలని నారా లోకేశ్ సిద్ధమయ్యారని, డబ్బులతోనే ముఖ్యమంత్రి కావచ్చు అనుకొంటే జగన్ ఎప్పుడో అయ్యేవారని, దేశంలో అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ ప్రధానమంత్రి అయ్యేవారని పవన్ అన్నారు. రాబోయే మూడేళ్లలో దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయని, కర్నాటక ఎన్నికల్లో 40 సీట్లు వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుందని ఊహించారా? అని ప్రశ్నించారు.
2019 ఎన్నికలకు భయపడే ఓట్లు తొలగిస్తున్నారని, 21 లక్షల మంది ఓట్లు తొలగించారని, ఇందులో 19.22 లక్షల ఓట్లు యువతరానివేనని అన్నారు. ఇవన్నీ మన ఓట్లేనని, 2009లో కూడా ఇలాగే చేశారని విమర్శించారు. ప్రతిఒక్కరూ తమ ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాలని, లేనివారు నమోదు చేసుకొనేలా చేయాలని, ‘జనసేన’ గెలిచే తొలి సీటు చింతలపూడి కావాలని, ఏలూరు ఎంపీ సీటు కూడా దక్కించుకోవాలని అన్నారు.