BCCI: సమాచార హక్కు చట్టం పరిధిలోకి బీసీసీఐ.. సీఐసీ ఆదేశాలు!
- బీసీసీఐ.. సీఐసీ పరిధిలోకి రావాలని ఆదేశాలు
- హైకోర్టును ఆశ్రయించాలనుకుంటున్న బీసీసీఐ
- బోర్డు పారదర్శకత కోసం కృషి
తమది స్వతంత్ర సంస్థ అని, తాము ప్రభుత్వ సంస్థల పరిధిలోకి రామని చాలా కాలంగా వాదిస్తున్న బీసీసీఐకి కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) షాక్ ఇచ్చింది. బీసీసీఐ సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు నియమించిన క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) నిర్లక్ష్యమే ఈ ఆదేశాలు రావడానికి కారణమని బీసీసీఐ అధికారులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఐసీ తీర్పును హైకోర్టులో సవాల్ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
‘‘జులై 10న సీఐసీ విచారణ జరిగింది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి బీసీసీఐ ఎందుకు రాదో చెప్పాలని ప్రశ్నించింది. దీనికి బోర్డు బదులివ్వలేదు. దీంతో షోకాజ్ నోటీసులు వచ్చాయి. ప్రస్తుతం మేము చేయగలిగింది సీఐసీ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేయడమే’ అని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితికి సీఓఏనే కారణమని బీసీసీఐ పేర్కొంటోంది. సీఓఏ పెద్దలు కావాలనే నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తోంది. సీఐసీ ఉత్తర్వులపై సీఓఏ అధినేత వినోద్ రాయ్ నేరుగా స్పందించలేదు. బోర్డు పారదర్శకత కోసం కృషి చేస్తున్నామని వెల్లడించిన ఆయన ఇప్పటికే వెబ్‌సైట్‌లో మార్పులు చేశామన్నారు. బోర్డులో సుపరిపాలన, నైతిక నిబంధనలు, పారదర్శకతకు తాము కట్టుబడ్డామని వెల్లడించారు.