Telugudesam: 2019లో టీడీపీ కానీ, వైసీపీ గానీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేవు: పవన్ కల్యాణ్
- ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి
- మేము ప్రభుత్వం స్థాపించేది లేనిదీ కాలమే చెబుతుంది
- డ్వాక్రా, రైతు రుణమాఫీలు చేయలేదు
రాష్ట్రంలో శరవేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని,2019 ఎన్నికల్లో టీడీపీ కానీ, వైసీపీ కానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రాజారాణి కల్యాణ మంటపంలో డ్వాక్రా సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో తమ పార్టీ పూర్తి మెజార్టీ సాధించి.. ప్రభుత్వాన్ని స్థాపిస్తుందా? లేక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా? అనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు.
డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ గురించి పవన్ ప్రస్తావించారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీలు జరుగుతాయా? సాధ్యమేనా? అని చంద్రబాబును అడిగితే, ‘కచ్చితంగా సాధ్యమే..నన్ను నమ్మండి’ అని చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడేమో, రుణమాఫీ చేయకపోగా పాత రుణాలు కూడా కట్టమంటున్నారని, ఏపీ వ్యాప్తంగా పరిస్థితి ఇలానే ఉందని పవన్ విమర్శించారు.