kishan reddy: కేటీఆర్.. నోరు అదుపులో పెట్టుకోండి: కిషన్ రెడ్డి
- నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడవద్దు
- దేశ ప్రజలంతా మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు
- తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది
ప్రధాని మోదీ తెలంగాణకు ఇస్తున్న నిధులు వారి ఇంటి నుంచి ఇవ్వడం లేదని... ప్రజలు చెల్లించిన పన్నులనే తిరిగి ఇస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడరాదని... నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కేటీఆర్ కు సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పారు. దేశ ప్రజలంతా మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని... కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని తెలిపారు.
ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని... ఇప్పటికే బూత్ స్థాయి నుంచి ఎన్నికల కమిటీలన్నింటినీ పూర్తి చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ లో ఈనెల 10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండో బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఐదేళ్లపాటు పాలించమని టీఆర్ఎస్ కు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే... నాలుగున్నరేళ్లకే చేతులెత్తేశారని విమర్శించారు. రాష్ట్ర సమస్యలను కేసీఆర్ పట్టించుకోకపోవడంతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తెలంగాణలోని 119 స్థానాలకు బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.