Coffee: కమ్మని కాఫీతో ఈ ప్రయోజనాలు కూడా వున్నాయట!
- టైప్ 2 మధుమేహం నివారణ
- కాలేయ సంబంధిత వ్యాధులకు దివ్యౌషధం
- మహిళల్లో డిప్రెషన్ తగ్గుదల
పొద్దున్నే లేవగానే ఓ కప్పు కాఫీ పడితేనే కానీ చాలా మందికి దినచర్య ప్రారంభం కాదు. అయితే, కొంతమంది ఈ కాఫీని మితంగా తాగితే, మరికొందరు కప్పుల మీద కప్పులు లాగించేస్తుంటారు. మరి, ఈ కాఫీ వల్ల మనకు ప్రయోజనాలు ఉన్నాయా? అన్న విషయానికి వస్తే, ఉన్నాయనే అంటున్నారు తాజా అధ్యయనకారులు. ఆ వివరాలు చూద్దాం..
* టైప్ -2 మధుమేహం రాకుండా చేయడంలో కాఫీ చక్కగా పనిచేస్తుందని అంటున్నారు. రోజుకి మూడు కంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగే వారిలో మధుమేహం వచ్చే అవకాశం 42 శాతం తగ్గుతుందని ఇటీవలి పరిశోధనల్లో తేలింది.
* కాలేయ వ్యాధులకు ఇది దివ్యౌషధమని రుజువైంది. కాలేయ కేన్సర్, సిరోసిస్ వంటి వ్యాధులు తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. సౌతాంప్టన్ వర్సిటీ ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో ఆసక్తి కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. రోజుకు ఓ కప్పు కాఫీ తీసుకుంటే సిరోసిస్ 22 శాతం తగ్గుతుందని తేలింది. అంతేకాకుండా రోజుకు 2 కప్పులు తీసుకుంటే 43 శాతం, మూడు కప్పులు తీసుకుంటే 57 శాతం కూడా తగ్గుతుందని పేర్కొంది.
* ఈ రోజుల్లో పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తున్న ప్రోస్టేట్ కేన్సర్ రాకుండా కూడా కాఫీ కాపాడుతుందట. అయితే ప్రత్యేకమైన ఇటాలియన్ వెరియంట్ కాఫీని తాగితేనే ఆ ఫలితం ఉంటుంది. ఈ కాఫీని అధిక ఉష్టోగ్రత, అధిక పీడనం మీద తయారు చేస్తారట.
* డిప్రెషన్ (కుంగుబాటు) ను కాఫీ సమర్థవంతంగా ఎదుర్కుంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా కాఫీ తాగడం వల్ల మహిళల్లో డిప్రెషన్ ముప్పు తగ్గుతుందట. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది.
* కాఫీలో ఉండే కెఫిన్ నరాల వ్యవస్థను ఉత్తేజపరుస్తుందని, దీంతో మన మెదడు పనితీరు మెరుగవుతుందని, మంచి మూడ్ లో ఉండేలా చేస్తుందని అధ్యయనకారులు తెలిపారు. ఏదైనా, అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు, కాఫీ ఎంత మంచిదైనా ఎక్కువగా తీసుకుంటే మాత్రం పలు సమస్యలు వస్తాయని పరిశోధకులు ఓ హెచ్చరిక కూడా పారేస్తున్నారు.