chandrababu: ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. రేపే బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ!
- యువతకు ప్లేస్ మెంట్స్ కల్పిస్తాం
- ఇప్పటి వరకు 2 లక్షల 15 వేల మంది లబ్ధిదారులు అర్హత సాధించారు
- యువతకు చేయూత.. దేశానికి భరోసా ఈ యువనేస్తం
నిరుద్యోగ యువతకు వరప్రదాయిని అయిన 'ముఖ్యమంత్రి యువనేస్తం' కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఉండవల్లి వేదికగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున యువత తరలి వచ్చింది. ఈ సందర్భంగా వారితో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. యువత తమ జీవితంలో స్థిరపడేందుకు యువనేస్తం ఒక ప్లాట్ ఫామ్ లా ఉపయోగపడుతుందని చంద్రబాబు చెప్పారు. ప్రముఖ నైపుణ్య శిక్షణా సంస్థలతో ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా... యువతకు ప్లేస్ మెంట్స్ వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ఇన్నొవేషన్ కు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు.
భారత దేశంలో యువత సంఖ్య చాలా ఎక్కువని... వారి నైపుణ్యాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకే ఈ కార్యక్రమమని చంద్రబాబు తెలిపారు. యువనేస్తం మన సమాజానికి పెద్ద భరోసా ఇవ్వగలగాలని చెప్పారు. 'యువతకు చేయూత... దేశానికి భరోసా' యువనేస్తమని అన్నారు. నిరుద్యోగుల ఖాతాల్లోకి నేరుగా రూ. 1000 భృతి జమ అవుతుందని చెప్పారు. 3వ తేదీన ఈ మొత్తం బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతుందని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో సంఖ్యాపరిమితి లేదని చెప్పారు. ప్రపంచంలో ఇలాంటి కార్యక్రమం ఎక్కడా సక్సెస్ కాలేదని... కానీ, ఎంతో చిత్తశుద్ధితో తాము ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత శాఖల్లో నోడల్ అధికారులు ఉంటారని చంద్రబాబు చెప్పారు. సర్వర్ స్తంభించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ నిరుద్యోగ భృతిని ఇస్తామని చెప్పారు. చదువు పూర్తయిన తర్వాత తల్లిదండ్రులపై ఆధారపడకుండా... తమ కాళ్లపై తాము నిలబడేలా ఈ కార్యక్రమం అండగా ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల 15 వేల మంది లబ్ధిదారులు ఈ కార్యక్రమానికి అర్హత సాధించారని చెప్పారు.