sharad pawa: రాఫెల్ డీల్: మాట మార్చిన శరద్ పవార్!

  • మోదీ చిత్తశుద్ధిని ప్రజలు శంకించడం లేదన్న పవార్
  • వెల్లువెత్తిన విమర్శలు
  • మోదీని సపోర్ట్ చేసే ప్రసక్తే లేదంటూ మాట మార్చిన ఎన్సీపీ అధినేత

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ప్రధాని మోదీ చిత్తశుద్ధిని దేశ ప్రజలెవరూ శంకించడం లేదంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తన వ్యాఖ్యలను పవార్ సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. 'నేను మోదీకి మద్దతుగా నిలిచానంటూ కొందరు విమర్శించారు. నేను మోదీని సపోర్ట్ చేయలేదు. ఆ పని చేయను కూడా' అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని మరట్వాడా ప్రాంతంలో జరిగిన పార్టీ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ఈ  మేరకు వ్యాఖ్యానించారు.

రాఫెల్ యుద్ధ విమానాలను కొనాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని... అయితే ఒక్కో విమానం ధర రూ. 650 కోట్ల నుంచి రూ. 1600 కోట్లకు ఎలా పెరిగిందనే విషయాన్ని మాత్రం పార్లమెంటుకు కేంద్రం వివరించాలని పవార్ అన్నారు. ఈ ఒప్పందంపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. 36 ఫైటర్ జెట్స్ కు కొనుగోలుకు సంబంధించిన మొత్తం ఒప్పందం విలువ ఎంతో బయటపెట్టాలని కోరారు.

మోదీకి అనుకూలంగా పవార్ వ్యాఖ్యలు చేసిన తర్వాత... కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. మీ కూటమి సభ్యుడు పవార్ కూడా వాస్తవాలు మాట్లాడుతున్నారని... మీరు కూడా వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ హితవు పలికారు. రాజకీయాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని... ఈ విషయంలో పవార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని బీజేపీ అధినేత అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో, దేశ వ్యాప్తంగా పవార్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో... ఆయన తన వ్యాఖ్యలను సరిదిద్దుకున్నారు.

  • Loading...

More Telugu News