Araku: మావోలు నన్ను చంపేస్తామన్నారు... అందుకే సమాచారం ఇచ్చాను!: పోలీసులతో సోమ బంధువు సుబ్బారావు

  • కిడారి, సోమల కదలికలపై ఉప్పందించింది సుబ్బారావే
  • విచారణలో అంగీకరించిన సుబ్బారావు
  • మావోలతో పలుమార్లు ఫోన్ లో మాట్లాడిన సుబ్బారావు

పది రోజుల క్రితం అరకు సమీపంలోని లివిటిపుట్టు వద్ద జరిగిన కిడారి సోమేశ్వరరావు, సివేరి సోమల జంట హత్యల కేసులో వారికి దగ్గరి వారి ప్రమేయం ఉందని అనుమానించిన పోలీసులు సివేరి బంధువు సుబ్బారావును అరెస్ట్ చేసి విచారించగా, ఆయన నేరం ఒప్పుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

మావోయిస్టులు తనను కలిసి కిడారిని, సోమలను ఒకేసారి అప్పగించకుంటే చంపేస్తామని బెదిరించారని, దీంతో భయపడి, ఏం చేయాలో పాలుపోకనే, వారిరువురూ కలసి ఓ కార్యక్రమానికి వెళుతున్నారన్న సమాచారాన్ని మావోలకు పంపానని సుబ్బారావు అంగీకరించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సోమకు దగ్గరి బంధువు అయిన సుబ్బారావు, కిడారికి ప్రధాన అనుచరుడు కూడా. దీంతో వారిద్దరి కదలికలపై సుబ్బారావుకు అన్నీ తెలుస్తుంటాయన్న ఆలోచనతోనే, పక్కా ప్లాన్ తో మావోలు ఆయన్ను ట్రాప్ చేశారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

విచారణలో భాగంగా సుబ్బారావు కాల్ డేటాను బయటకు తీసిన పోలీసులు, అతనితో మావోయిస్టులు టచ్ లో ఉన్నారని గుర్తించి, రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. తాను మావోలతో పలుమార్లు మాట్లాడిన మాట నిజమేనని, ప్రాణం పోతుందన్న భయంతోనే ఈ పని చేశానని, కారులో రూ. 3 కోట్లు ఉన్నాయన్న విషయం తనకు తెలియదని సుబ్బారావు పోలీసుల విచారణలో తెలిపినట్టు సమాచారం.

Araku
Maoists
Subbarao
Kidari
Soma Siveri
  • Loading...

More Telugu News