Indonesia: ఇండోనేషియాలో మరో భూకంపం... ఈ దఫా సుంబాదీవి అతలాకుతలం!
- సుంబాదీవిలో 5.9 తీవ్రతతో భూకంపం
- ఇప్పటివరకూ 32 మంది మరణించినట్టు వార్తలు
- కుప్పకూలిన వందలాది భవనాలు
నాలుగు రోజుల నాడు సంభవించిన భూకంపం, ఆపై వచ్చి సునామీ నుంచి ఇండోనేషియా పూర్తిగా తేరుకోకముందే మరో భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. సులవేసి దీవి ఇప్పటికే నామరూపాలు లేకుండా పోగా, తాజాగా వచ్చిన భూకంపం సుంబాదీవిని అల్లాడించింది. ఈ తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం రాగా, వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి.
ఇప్పటివరకూ 32 మంది మరణించినట్టు వార్తలు అందుతుండగా, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లు రెండుగా చీలిపోయాయని, భవంతుల కింద వందలాది మంది చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యల నిమిత్తం సిబ్బందిని సుంబాదీవికి పంపుతున్నామని తెలిపారు. సుంబాదీవి భూకంపంపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.