apple: ఆపిల్ మేనేజర్ కాల్చివేత కేసు: వివేక్ భార్య, పిల్లలను పరామర్శించిన ముఖ్యమంత్రి యోగి!

  • ఆపిల్ మేనేజర్ కాల్చివేత కేసు
  • మృతుడి భార్యను పరామర్శించిన సీఎం
  • ఇద్దరు కానిస్టేబుళ్లు రిమాండ్ కు తరలింపు

ఇటీవల లక్నోలో ఆపిల్ ఉన్నతాధికారి వివేక్ తివారీ అర్ధరాత్రి వేళ తన సహోద్యోగితో కలసి కారులో వస్తుండగా, పోలీసులు జరిపిన కాల్పులలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. అమాయకుడిని పోలీసులు అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించాయి. దీంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ రోజు తన నివాసంలో వివేక్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ భార్య, ఇద్దరు కుమార్తెలను ఆయన ఓదార్చారు. 25 నిమిషాల పాటు ఆయన వీరితో మాట్లాడారు. అనంతరం వివేక్ భార్య కల్పన విలేకరులతో మాట్లాడుతూ..తమ బాధలను ఆయన సావధానంగా విన్నారని, తమ డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారని, ఆయన పట్ల తనకు విశ్వాసం వుందని అన్నారు.

మరోవైపు  వివేక్ కుటుంబానికి రూ. 25 లక్షలు, ఆయన తల్లి చికిత్సకు రూ.5 లక్షలు, కుమార్తెల చదువుకు మరో రూ. 5 లక్షలను యోగి ప్రభుత్వం ప్రకటించింది. అయితే కల్పనా మాత్రం తమ కుటుంబానికి రూ.కోటి పరిహారం, కేసుపై సమగ్ర విచారణ, తనకు ఉన్నత ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, వివేక్ పై కాల్పులు జరిపిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News