Pakistan: పాకిస్థాన్ ను నాలుగు ముక్కలు చేయడమే ఆ దేశానికి పరిష్కారం: సుబ్రహ్మణ్యస్వామి
- ఇమ్రాన్ పేరుకే ప్రధాని.. పాక్ ప్రభుత్వంలో ఆయనొక ప్యూన్ లాంటి వాడు
- పాక్ ను సైన్యం, ఐఎస్ఐ, ఉగ్రవాదులే పాలిస్తున్నారు
- అదను చూసి.. పాక్ ను నాలుగు ముక్కలు చేయాలి
పాకిస్థాన్ ను ప్రస్తుతం సైన్యం, ఐఎస్ఐ, ఉగ్రవాదులే పాలిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక చప్రాసీ మాత్రమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ను పేరుకే ప్రధాని అని పిలుస్తున్నారని.. పాక్ ప్రభుత్వంలో ఆయన ఒక ప్యూన్ లాంటివాడని ఎద్దేవా చేశారు.
పాకిస్థాన్ ను నాలుగు ముక్కలు చేయడమే ఆ దేశానికి పరిష్కారమని చెప్పారు. బలూచ్ లు పాకిస్థాన్ లో ఉండేందుకు ఇష్టపడటం లేదని... సింధీలు, పష్తూన్లది కూడా అదే దారని చెప్పారు. ఈ నేపథ్యంలో బలూచ్ ప్రజలకు బలూచిస్థాన్ ను ఇచ్చేయాలని చెప్పారు. దేశాన్ని బలూచిస్థాన్, సింధ్, పష్తూన్ లతో పాటు అవశేష పశ్చిమ పంజాబ్ గా విడగొట్టాలని సూచించారు.
పాకిస్థాన్ గురించి మాట్లాడుతూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమయాన్ని వృథా చేసుకోరాదని స్వామి సలహా ఇచ్చారు. మన సైన్యాన్ని సన్నద్ధం చేసుకోవాలని... అదను చూసి ఆ దేశాన్ని నాలుగు ముక్కలు చేస్తే సరిపోతుందని చెప్పారు.