Bollywood: మహిళల సమస్యలపై అమితాబ్ సినిమాల్లోనే స్పందిస్తారు.. నిజ జీవితంలో కళ్లు మూసుకుంటారు!: తనుశ్రీ దత్తా

  • బిగ్ బీ పై తనుశ్రీ దత్తా తీవ్ర వ్యాఖ్యలు
  • క్యాస్టింగ్ కౌచ్ పై బచ్చన్ వ్యాఖ్యలతో మనస్తాపం
  • ప్రజల నుంచి మద్దతు కరువైందని వెల్లడి

బాలీవుడ్ లో హీరోయిన్ తనుశ్రీ దత్తా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత తనను సీనియర్ నటుడు నానా పటేకర్ లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే  కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కూడా తనను లైంగికంగా వేధించాడని ఆమె చెప్పింది.

 దీంతో ఈ వివాదంపై సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా తనుశ్రీ దత్తాకు మద్దతుగా నిలిచారు. అయితే ఈ వివాదంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించేందుకు నిరాకరించారు. ఈ వివాదంపై మాట్లాడటానికి తాను తను శ్రీ దత్తాను కానీ, నానా పటేకర్ ను కానీ కాదని స్పష్టం చేశారు. దీంతో అమితాబ్ వ్యాఖ్యలపై తనుశ్రీ దత్తా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

అమ్మాయిల సమస్యల గురించి స్పందించని అమితాబ్ లాంటి వ్యక్తులు సామాజిక కథాంశాల ఆధారంగా ‘పింక్’ వంటి సినిమాలు తీస్తున్నారని విమర్శించింది. ఇలాంటి వ్యక్తులు నిజజీవితంలో కళ్ల ఎదుట జరిగే దారుణాన్ని ప్రశ్నించరనీ, కళ్లు మూసుకుంటారని వ్యాఖ్యానించింది. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై తాను చివరివరకూ పోరాడుతానని స్పష్టం చేసింది.

క్యాస్టింగ్ కౌచ్ కారణంగా తాను 30-40 సినిమా ఆఫర్లను వదులుకున్నానని ఆమె బయటపెట్టింది. తనకు ప్రస్తుతం అమెరికా పౌరసత్వం ఉందనీ, త్వరలోనే తాను అమెరికాకు వెళ్లిపోతానని తెలిపింది. బాలీవుడ్ లో తిరిగి అడుగుపెట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసింది. తనకు పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారనీ, కాని ప్రజల నుంచి మాత్రం నైతిక మద్దతు కొరవడిందని ఆవేదన వ్యక్తం చేసింది.

Bollywood
Casting Couch
tanusree dutta
Amitabh Bachchan
nana patekar
  • Loading...

More Telugu News