STATE BANK OF INDIA: వినియోగదారులకు ఎస్బీఐ మరో షాక్.. విత్ డ్రా పరిమితి రూ.20 వేలకు తగ్గింపు!
- గతంలో రూ.40,000గా ఉన్న మొత్తం
- అక్టోబర్ 31 నుంచి అమలు చేస్తామని ప్రకటన
- బ్రాంచీలకు సమాచారం పంపిన ఎస్బీఐ
ఇప్పటికే మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలతో వినియోగదారుల నడ్డి విరుస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ రోజుకు ఏటీఎం కార్డు నుంచి గరిష్ట విత్ డ్రా పరిమితి రూ.40,000 ఉండగా, తాజాగా దాన్ని రూ.20 వేలకు కుదిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ నిర్ణయం అక్టోబర్ 31 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది.
డిజిటల్ లావాదేవీలు పెంచాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏటీఎంల వద్ద నగదు విత్ డ్రా సందర్భంగా మోసాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తడం కూడా తాజా నిర్ణయానికి కారణమన్నారు. బ్యాంకు నిబంధనల ప్రకారం క్యాష్ విత్ డ్రా లో మార్పులు చేస్తే 30 రోజుల ముందుగా కస్టమర్లకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు.
ఈ విషయమై అన్ని బ్రాంచీలకు ఇప్పటికే సమాచారం అందజేశామన్నారు. రూ.20 వేల కన్నా ఎక్కువ మొత్తంలో విత్ డ్రా చేసుకోవాలంటే అందుకు అనువైన మరో కార్డు కోసం కస్టమర్లు బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.