China: ప్రయాణికుడిపై విమానాశ్రయ సిబ్బంది దాడి.. విచారం వ్యక్తం చేసిన థాయిలాండ్ ప్రధాని!
- విమానాశ్రయంలో పర్యాటకుడితో అధికారి గొడవ
- దాడి చేసిన భద్రతా సిబ్బంది
- వీడియో వైరల్.. సీరియస్‌గా స్పందించిన ప్రభుత్వం
థాయ్‌లాండ్ పర్యటనకు వచ్చిన చైనా పర్యాటకుడిపై బ్యాంకాక్‌లోని విమానాశ్రయ సిబ్బంది ఒకరు దాడి చేశారు. పర్యాటకుడి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చి వైరల్ కావడంతో థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ చాన్‌వో చా విచారం వ్యక్తం చేశారు. మరోమారు ఇటువంటి ఘటన జరగకుండా జాగ్రత్త పడతామని ప్రభుత్వం తెలిపింది.
ఘటనపై ప్రధాని మాట్లాడుతూ.. ఆ పర్యాటకుడు అవసరమైన పత్రాలు సమర్పించలేదని, అధికారులతో అమర్యాదగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. అయినప్పటికీ అతడికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్టు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. అలాగే, ప్రయాణికుడిపై దాడిచేసిన వ్యక్తిని విధుల నుంచి తప్పించినట్టు చెప్పారు. ఈ ఘటనకు తమదే బాధ్యతని, చైనా పర్యాటకులను క్షమాపణ వేడుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాగా, చైనా నుంచి ప్రతీ ఏడాది 35 మిలియన్ల మంది పర్యాటకులు బ్యాంకాక్‌ను సందర్శిస్తుంటారు.