BCCI: పాకిస్థాన్‌కు పైసా కూడా ఇవ్వకూడదని బీసీసీఐ నిర్ణయం.. నేటి విచారణకు గైర్హాజరు!

  • బీసీసీఐ నుంచి రూ.447 కోట్లు ఇప్పించాల్సిందిగా ఐసీసీని కోరిన పీసీబీ
  • పైసా కూడా ఇవ్వబోమన్న బీసీసీఐ
  • స్పష్టం చేసిన అనురాగ్ ఠాకూర్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో ఉన్న వివాదంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది. పాకిస్థాన్‌కు నయా పైసా కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ముంబై బాంబు పేలుళ్ల ఘటనలో పాకిస్థాన్ హస్తం ఉందని తేలడంతో పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను భారత్ రద్దు చేసుకుంది.

అప్పటికే కుదుర్చుకున్న సిరీస్‌ను బీసీసీఐ రద్దు చేయడంతో పాకిస్థాన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని ఆశ్రయించింది. భారత్ సిరీస్‌లను రద్దు చేసుకోవడం వల్ల తమకు బోల్డంత నష్టం వాటిల్లిందని, నష్టపరిహారింగా బీసీసీఐ నుంచి రూ.447 కోట్లు ఇప్పించాలని కోరింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఐసీసీ విచారణకు సిద్ధమైంది. దీంతో స్పందించిన అనురాగ్ ఠాకూర్ ఈ ప్రకటన చేశారు. తాము పైసా కూడా పాకిస్థాన్‌కు చెల్లించబోమని, విచారణకు కూడా హాజరు కాబోమని తేల్చి చెప్పారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. భారత్-పాక్ బోర్డుల మధ్య నెలకొన్న వివాదాన్ని ఇరు దేశాలు పరిష్కరించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌తో భారత్ ఆడాలనుకుంటున్నా ప్రభుత్వం అనుమతి అవసరమని పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో నేరుగా తలపడకున్నా తటస్థ వేదికలపై ఇరు జట్లు తలపడుతూనే ఉన్నాయన్నారు. కాబట్టి పాకిస్థాన్‌కు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని శుక్లా తేల్చి చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News