Telugudesam: సీటు హామీ లభిస్తేనే.. టీడీపీలో చేరతారట!

  • కడప జిల్లాలో డీఎల్ రవీంద్రా రెడ్డి
  • కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగి ఖాళీగా ఉన్న కొణతాల రామకృష్ణ
  • విశాఖ కీలక నేతలు సబ్బం హరి, దాడి వీరభద్రరావు
  • చేరికలపై తుది నిర్ణయం చంద్రబాబుదే

మంత్రిగా పనిచేసిన అనుభవమున్నా, ప్రస్తుతం ఎటూ కాకుండా పోయిన డీఎల్ రవీంద్రా రెడ్డి... గతంలో టీడీపీలో ఓ వెలుగు వెలిగిన దాడి వీరభద్రరావు... కాంగ్రెస్ లో పలు పదవులు అనుభవించి, ప్రస్తుతం ఖాళీగా ఉన్న మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ... వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్ కు దూరమైన మరో మాజీ ఎంపీ సబ్బం హరి...

వీరు నలుగురూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారట. టీడీపీలో చేరాలంటే, తమకు సీటు ఇస్తామని హామీ ఇవ్వాలని కండిషన్ పెడుతున్నారట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తున్న ఈ నలుగురి ఉదంతంపై తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్న వివరాల ప్రకారం...

సీనియర్లే అయినా, రాజకీయ అవకాశాలపై స్పష్టత రాకపోవడంతో, వీరంతా తాము అడిగిన ప్రాంతాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నేతలతో బేరాలాడుతున్నారు. కడప జిల్లాకు చెందిన డీఎల్ రవీంద్రారెడ్డిని చేరదీసిన తెలుగుదేశం, ఇప్పుడాయన్ను వ్యూహాత్మకంగానే దూరం పెట్టింది. టీటీడీ చైర్మన్ గా పుట్టాను ఎంపిక చేసింది డీఎల్ కోసమేనని, ఆయన్ను మైదుకూరు నుంచి బరిలోకి దించుతారని కూడా వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో డీఎల్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించింది. ఎవరికీ సమాధానం చెప్పని డీఎల్, టీడీపీవైపు ఆసక్తిని చూపుతూ సీటు గ్యారెంటీ అన్న హామీని ఆశిస్తున్నారు.

ఇక దాడి వీరభద్రరావు విషయానికి వస్తే, టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన, 2014కు ముందు వైసీపీలో చేరి, కుమారుడు రత్నాకర్ ను విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపి ఓటమి పాలయ్యారు. ఆపై వైకాపాను వీడిన ఆయన, ఓ మారు పవన్ కల్యాణ్ ను కలిశారు కూడా. ప్రస్తుతం టీడీపీ నేతలతో మాట్లాడుతున్న ఆయన, సీటు గ్యారెంటీని కోరుతుంటే, షరతుల్లేకుండా చేరితే బాగుంటుందని కళా వెంకట్రావు ద్వారా చంద్రబాబు చెప్పించినట్టు టీడీపీ వర్గాలు అంటున్నాయి.

విశాఖ జిల్లాలోని మరో కీలక నేత కొణతాల రామకృష్ణ, రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తొలుత కాంగ్రెస్ లో, ఆపై వైసీపీలో కొంతకాలం ఉండి, ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న ఆయన, అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తానంటే టీడీపీలో చేరుతానని అంటున్నారు. ఇదే జిల్లాకు చెందిన సబ్బం హరి పరిస్థితి కూడా ఇంతే. కొద్దికాలం క్రితం చంద్రబాబును కలిసి చర్చలు జరిపిన ఆయన, విశాఖ నగరంలో అసెంబ్లీ సీటు లేదా అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వీరందరి చేరికపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం చంద్రబాబే!

Telugudesam
Chandrababu
DL Ravindra Reddy
Konatala Ramakrishna
Sabbam Hari
Dadi Veerabhadrarao
  • Loading...

More Telugu News