Araku: కిడారి హత్య అనంతరం పోలీస్ స్టేషన్లపై దాడికి రెచ్చగొట్టిన గంజాయి స్మగ్లర్!
- పోలీసులు తనపై పదేపదే కేసులు బనాయిస్తుండడంతో ఆగ్రహం
- గిరిజనులను రెచ్చగొట్టి దాడికి కుట్ర
- నేడో, రేపో అరెస్ట్
మావోయిస్టుల చేతిలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య తర్వాత గిరిజనులు ఆగ్రహంతో పోలీస్ స్టేషన్లపై దాడిచేశారు. స్టేషన్లకు నిప్పు పెట్టారు. పోలీసులను చితకబాదారు. అయితే, ఈ మొత్తం ఘటన వెనక ఓ గంజాయి స్మగ్లర్ ఉన్నట్టు పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో గిరిజనులను రెచ్చగొట్టి దాడికి పురికొల్పింది ఆయనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు మనల్ని నిత్యం వేధిస్తున్నారని, చివరికి మన నేతలను కూడా మనం రక్షించుకోలేకపోయామంటూ గిరిజనులను అతడు రెచ్చగొట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. అతడి మాటలతో రెచ్చిపోయిన గిరిజనులు పోలీస్ స్టేషన్లపై దాడిచేసి తగలబెట్టారు. కానిస్టేబుళ్లను పట్టుకుని చితగ్గొట్టారు. స్టేషన్లను తగలబెడుతున్న వీడియోలను పరిశీలించిన పోలీసులు అందులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
స్మగ్లర్ నుంచి అందిన సంకేతాలతోనే తాము దాడికి పాల్పడినట్టు వారు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. కిడారి హత్య విషయంలో అతడు కూడా కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తనపై పదేపదే గంజాయి కేసులు పెట్టి వేధిస్తుండడంతోనే దాడికి రెచ్చగొట్టినట్టు సమాచారం. కిడారి సమాచారాన్ని మావోలకు అందించి అతడి హత్యకు కారణమైన టీడీపీ నేతలతోపాటు స్మగ్లర్ అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.