bangalore: గౌరీ లంకేశ్ హత్య కేసు..సిట్ పై నిందితుల తీవ్ర ఆరోపణలు
- ఈ నేరం ఒప్పుకోవాలని నాపై ఒత్తిడి చేశారు
- రూ.25 లక్షలు ఇచ్చి నేరం ఒప్పుకోమన్నారు
- కుటుంబాన్ని బెదిరించి తనతో ఈ నేరం ఒప్పించారు
- నిందితులు పరశురామ్, మనోహర్
‘లంకేశ్’ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితులు పరశురామ్ వాగ్మేర్, మనోహర్ లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)పై సంచలన ఆరోపణలు చేశారు. వీళ్లిద్దరూ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు గుప్పించారు. పరశురామ్ మాట్లాడుతూ, ఈ కేసు విచారణ నిమిత్తం సిట్ ఏర్పాటు చేసినప్పుడు సంబంధిత అధికారులు నేరుగా తన వద్దకే వచ్చారని, ఈ నేరం ఒప్పుకోవాలని తనపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తమకు బెదిరింపులు మొదలయ్యాయని, తనకు రూ.25 లక్షలు ఇచ్చి నేరం ఒప్పుకోమని సిట్ అధికారులు చెప్పారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మనోహర్ మాట్లాడుతూ, గౌరీ లంకేశ్ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ, తనను, తన కుటుంబాన్ని బెదిరించి తనతో ఈ నేరం ఒప్పించారని ఆరోపించారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్ 5న గౌరీ లంకేశ్ హత్యకు గురయ్యారు. ఈ కేసు విచారణ నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 14 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.