Pawan Kalyan: రైతు సమస్యలపై త్వరలో రాజధాని అమరావతిలో సదస్సు : పవన్ కల్యాణ్
- పొగాకు, ఆయిల్ పామ్ రైతులతో సమావేశం
- కౌలు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
- వారం, పది రోజులు రైతులతో సదస్సులు నిర్వహిస్తా
రైతు సమస్యలపై త్వరలో రాజధాని అమరావతిలో ఓ సదస్సు నిర్వహిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు, ఆయిల్ పామ్ రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, వ్యవసాయం గురించి తనకు తెలుసని, కనిపించే దేవుడే రైతు అని రైతుల పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు.
ఇంటి పెద్దగా కుటుంబాన్ని నడపడమే చాలా కష్టమని, ఒక పార్టీని నడపాలంటే అన్ని విషయాలు తెలిసి ఉండాలని, వారం, పది రోజులు రైతులతో సదస్సులు నిర్వహిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కౌలు రైతుల గురించి కూడా ప్రస్తావించారు. కౌలు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, పండిన పంటకు కావాల్సింది మద్దతు ధర కాదు, గిట్టుబాటు ధర అని డిమాండ్ చేశారు.
‘మేనిఫెస్టోలో రైతు సమస్యల గురించి బలంగా ఎందుకు ప్రస్తావించడం లేదంటే.. అవి లోతైన సమస్యలు. సమస్యలను సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే వచ్చే పరిష్కారాలు చాలా బలంగా ఉంటాయి’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.