Hospital: రోగి చనిపోయాక కూడా మూడు రోజులు వైద్యం చేసిన ఆసుపత్రి.. 'ఠాగూర్'ను తలపించే ఘటన!
- చనిపోయిన వ్యక్తికి మూడు రోజులపాటు చికిత్స
- ఇంకా చికిత్స అందించాలని డబ్బు గుంజే ప్రయత్నం
- ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో గుట్టు రట్టు
ఠాగూర్ సినిమాలోని ఆసుపత్రి సన్నివేశాన్ని తలపించే ఘటన తమిళనాడులో జరిగింది. చనిపోయిన వ్యక్తికి ఓ ఆసుపత్రిలో ఏకంగా మూడు రోజులపాటు వైద్య సేవలు అందించడం సంచలనంగా మారింది. తమిళనాడు నాగపట్టణం జిల్లాలోని తంజావూర్ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. తన తండ్రి ఎన్.శేఖర్ (55) చనిపోయి మూడు రోజులైనా వైద్యులు చికిత్స చేశారని, తన తండ్రి ఆరోగ్యం గురించి అడిగితే ఇంకా వైద్యం చేస్తూనే ఉన్నామని బదులిచ్చారని ఆయన కుమారుడు సుభాష్ తెలిపారు.
సుభాష్ కథనం ప్రకారం.. సెప్టెంబరు 9న శేఖర్ కడుపునొప్పితో నాగపట్టణంలోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు అక్కడి నుంచి తంజావూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి రెఫర్ చేశారు. సెప్టెంబరు 10న శేఖర్‌ను అక్కడికి తరలించారు. ఆసుపత్రి యాజమాన్యం తొలుత రూ.5 లక్షలు కట్టించుకుంది. చికిత్స కొనసాగించేందుకు మరో రూ.3 లక్షలు చెల్లించాల్సిందిగా శుక్రవారం బాధిత కుటుంబాన్ని కోరింది.
ఇక తమ వద్ద డబ్బు లేకపోవడంతో, శేఖర్‌ను తంజావూర్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు ఆయన చనిపోయి మూడు రోజులు అయిందని చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. దీంతో శుభాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆసుపత్రి యాజమాన్యం తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శేఖర్ మృతి చెందిన విషయాన్ని చెప్పాల్సింది పోయి ఇంకా ఫీజు అడగడం దారుణమని సీపీఐ ఎమ్మెల్యే జి.పళనిస్వామి అన్నారు. కాగా, పోస్టుమార్టం రిపోర్టు కోసం వేచి చూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శేఖర్ మూడు రోజుల క్రితమే మరణించినట్టు పోస్టుమార్టంలో తేలితే ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామన్నారు.
బాధిత కుటుంబం ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం ఖండించింది. ఆసుపత్రి పేరును చెడగొట్టాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నట్టు ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. బాధిత కుటుంబంపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.