woman: మాకు 50 ఏళ్లు వచ్చాక కానీ శబరిమల ఆలయంలో అడుగుపెట్టం: తేల్చి చెప్పిన 'హిందూ మున్నాని' మహిళలు
- కోర్టు ఆదేశాలతో పనిలేదు
- 50 ఏళ్లు వచ్చాకే ఆలయంలోకి వెళ్తాం
- సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ తమిళనాడు ఆలయాల్లో మహిళల నిరసన
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తాము మాత్రం 50 ఏళ్లు వచ్చే వరకు ఆలయంలోకి వెళ్లబోమని భారత హిందూ మున్నాని సంస్థ మహిళా సభ్యులు తెలిపారు. 10-50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లడం నిన్నటివరకు నిషేధం. వారింకా పునరుత్పత్తి దశలోనే ఉంటారని, మైల పడుతూ ఉంటారు కాబట్టి ఆలయ సందర్శనను నిషేధించారు. తాజాగా సుప్రీంకోర్టు ఈ విషయంలో తీర్పు ఇస్తూ వయసు నిబంధనను కొట్టివేసి మహిళలందరూ అయ్యప్పను సందర్శించవచ్చని తేల్చి చెప్పింది.
సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ హిందూ మున్నాని సంస్థ ఆధ్వర్యంలో మహిళలు తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో దీపాలు వెలిగించి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ.. కోర్టు తీర్పు ఏమైనప్పటికీ తాము మాత్రం సనాతన ఆచారాలనే పాటిస్తామని తేల్చి చెప్పారు.
హిందూ మక్కల్ కచ్చి చీఫ్ అర్జున్ సంపత్ మాట్లాడుతూ.. కోయంబత్తూరు, కడలూరు, తిరుపూర్ వ్యాప్తంగా ఈ నిరసన ప్రదర్శనలు చేపట్టినట్టు చెప్పారు. గతంలోని కట్టుబాట్లపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. మహిళల ఆలయ ప్రవేశం అనేది విశ్వాసంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సంతకాల సేకరణ చేపట్టినట్టు వివరించారు. అనంతరం వాటిని శబరిమల ఆలయంలోని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డుకు అందజేయనున్నట్టు తెలిపారు.