russia: రష్యా అధ్యక్షుడికి యుద్ధ విమానాలను బహూకరించనున్న భారత్!
- అక్టోబర్ లో భారత్ పర్యటనకు రానున్న పుతిన్
- మూడు మిగ్ విమానాలను గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న భారత్
- మూడు విమానాలు ఇవ్వాలంటూ గతంలో ఇండియాను కోరిన రష్యా రక్షణ మంత్రి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు మిగ్-21 విమానాలను బహూకరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ నెలలో పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మూడు మిగ్-21 విమానాలను బహూకరించేందుకు భారత్ ఏర్పాట్లు చేస్తోంది. మూడు మిగ్ విమానాలు ఇవ్వాలంటూ రష్యా రక్షణ మంత్రి చేసిన అభ్యర్థన మేరకు భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక ఒప్పందాలు బలంగా ఉన్నాయన్న సంకేతాలను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మిగ్ యుద్ధ విమానాలను రష్యానే తయారు చేసింది. మన వద్ద మొత్తం 121 మిగ్ విమానాలు ఉన్నాయి. వీటిలో టైప్ 75, టైప్ 77 విమానాలను రష్యాకు గిఫ్ట్ గా ఇవ్వనుంది. 1985లో మిగ్ విమానాల తయారీని రష్యా నిలిపివేసింది. అయినా భారత్ ఇంకా ఆ విమానాలను వాడుతూనే ఉంది. 1963లో మిగ్ ల తయారీ కోసం అనుమతులు తెచ్చుకున్న భారత్... ఆ విమానాలతో వైమానిక దళాన్ని బలోపేతం చేసుకుంది. మరోవైపు, 2022లోగా దశల వారీగా మిగ్ లను తగ్గించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.