Chandrababu: శాశ్వతంగా మిమ్మల్ని పూడ్చి పెడతాం: బీజేపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
- కేంద్రం సహకరించకపోయినా అమరావతిని కట్టుకుంటాం
- అమరావతి బాండ్లకు గంటలో 2 వేల కోట్లు వచ్చాయి
- ప్రతి ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు
తెలుగుదేశం పార్టీకి పశ్చిమగోదావరి జిల్లా కంచుకోట అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలో రెండు పంటలకు నీరు ఇస్తామని తెలిపారు. వచ్చే మే నెలలో గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామని అన్నారు. కేంద్రం సహకారం అందించకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీదేనని తెలిపారు.
ముంబై మెట్రోకు కేంద్రం రూ. 52,000 కోట్లు ఇచ్చిందని... అమరావతి నిర్మాణానికి మాత్రం కేవలం రూ. 1500 కోట్లు మాత్రమే ఇచ్చిందని మండిపడ్డారు. కేంద్రం సహకరించపోయినా అమరావతిని కట్టుకుంటామని చెప్పారు. అమరావతి బాండ్లకు వెళితే గంటలో రూ. 2వేల కోట్లు వచ్చాయని చెప్పారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో మాట్లాడుతూ, చంద్రబాబు పైవ్యాఖ్యలు చేశారు.
హక్కులను సాధించుకునేందుకే కేంద్రంతో విభేదించామని... దీంతో, రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా ఆపుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని... సవరించిన అంచనాలను ఇంకా ఆమోదించలేదని చెప్పారు. కడప ఉక్కు కర్మాగారాన్ని విస్మరించారని మండిపడ్డారు. విజయవాడ, విశాఖపట్నంలకు మెట్రో రైలు ఇవ్వడం లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. దుగరాజపట్నం ఓడరేవును, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీని శాశ్వతంగా పూడ్చిపెడతామని అన్నారు.