Revanth Reddy: కనీసం స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నట్లు చెప్పినా గౌరవంగా ఉండేది!: మీడియా కథనాలపై రేవంత్ సెటైర్
- తన కుటుంబాన్ని క్షోభ పెట్టారని మండిపాటు
- వెయ్యి కోట్ల అక్రమాస్తులు దొరికాయన్న కథనంపై ఆగ్రహం
- హాంకాంగ్, మలేసియాకు వెళ్లలేదని స్పష్టీకరణ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ రోజు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తన నివాసం, కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడుల సందర్భంగా కొన్ని మీడియా సంస్థల వ్యవహారశైలిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఐటీ దాడుల సందర్భంగా కొందరు మీడియా మిత్రులు వెన్నెముక లేకుండా దిగజారి ప్రవర్తించారని విమర్శించారు. ఈ రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు.
కొన్ని మీడియా సంస్థలు ఐటీ దాడుల సందర్భంగా ఇష్టానుసారం కథనాలు ప్రసారం చేయడంతో పాటు పత్రికల్లో రాశాయని రేవంత్ అన్నారు. తప్పుడు కథనాలతో తన కుటుంబాన్ని తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని చెప్పారు. మలేసియా, హాంకాంగ్ లో అకౌంట్లు ఓపెన్ చేసి కోట్లాది రూపాయల వ్యవహారాలు నడిపినట్లు కొందరు తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక అసలు మలేసియా, హాంకాంగ్ లకు వెళ్లనేలేదనీ, అలాంటప్పుడు బ్యాంకు అకౌంట్లు తెరవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దున్నపోతు ఈనిందంటే.. దూడను కట్టేయండి అన్న రీతిన రిపోర్టర్లు తయారయ్యారని రేవంత్ విమర్శించారు.
హాంకాంగ్ లో బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే స్థానికంగా పౌరసత్వం ఉండాలన్నారు. ఒకవేళ పౌరసత్వం లేకుంటే అక్కడే పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా నివాస ధ్రువీకరణ లేదా ఉద్యోగం చేస్తూ ఉండాలన్నారు. వీటిలో ఏ అర్హతా తనకు లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. కనీసం ‘స్విట్జర్లాండ్ బ్యాంకులో రేవంత్ డబ్బులు దాచుకున్నాడు’ అని చెప్పినా తనకు కొంత గౌరవం దక్కేదని ఎద్దేవా చేశారు. హాంకాంగ్ తో పోల్చుకుంటే మలేసియాలో నిబంధనలు మరింత కఠినమనీ, ఈ విషయాలన్నీ ఇంటర్నెట్ లో సులభంగా దొరుకుతాయని స్పష్టం చేశారు.
ఐటీ దాడుల్లో రూ.10-20 కోట్ల అక్రమాస్తులు దొరికినట్లు కొన్ని మీడియా సంస్థలు రాస్తే.. ఓ మీడియా సంస్థ మాత్రం రూ.1,000 కోట్లు దొరికినట్లు రాసిందని చెప్పారు. ఇదంతా కేసీఆర్ ఒత్తిడితోనే రాస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే తనపై చేసిన చిల్లర ఆరోపణలను చిల్లర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించాలని సవాల్ విసిరారు.