Revanth Reddy: నా అత్తారింటివారు కోటీశ్వరులు.. వాళ్లకు బినామీ ఆస్తులతో పనేంటి?: రేవంత్ ఆగ్రహం
- నా మామ తండ్రి 100 ఊర్లకు అప్పులిచ్చేవాడు
- ఆయన అమ్మిన స్థలంలోనే కోదండరాం ఉంటున్నారు
- మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనీ, షెల్ కంపెనీలతో బినామీ ఆస్తులను కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో రేవంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తన పెళ్లి 1992, మే 7న జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటీ దాడుల సందర్భంగా కొందరు టీఆర్ఎస్ నేతలు తన మామయ్య పద్మనాభరెడ్డితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారన్నారు. వారంతా తనకు బినామీగా ఉన్నట్లు చెప్పడంపై రేవంత్ వ్యంగ్యంగా స్పందించారు. సదరు నేతకు బినామీ ఆస్తులంటే అర్థమే తెలియదని వ్యాఖ్యానించారు. తనకు పిల్లనిచ్చిన మామ పద్మనాభరెడ్డి అప్పట్లోనే ఆల్ ఇండియా కిరోసిన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడని తెలిపారు.
పద్మనాభ రెడ్డి తండ్రి దుర్గారెడ్డికి వందల ఎకరాల భూమి ఉండేదన్నారు. దుర్గారెడ్డి దాదాపు 100 గ్రామాల్లోని రైతులకు అప్పు ఇచ్చేవాడన్నారు. ఆయనకు హైదరాబాద్ నడిబొడ్డున చాలా ఆస్తులు ఉన్నాయన్న రేవంత్.. ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరాం ఉంటున్న ‘తార్నాక లేఅవుట్’ కూడా ఆయనదేనని చెప్పారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆయన నుంచి ఎకరాల్లో భూమిని కొనుగోలు చేసి గజాల్లో ప్లాట్లు వేసి అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు.
ఇక తన కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు, ఓ సోదరి ఉన్నారని రేవంత్ అన్నారు. ఇంతమంది ఇంట్లో ఉంటే మరొకరి పేరుపై బినామీ ఆస్తులను పెట్టాల్సిన అగత్యం ఏముందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ రౌడీ షీటర్ చేత తనపై తప్పుడు ఆరోపణలు చేయించారని మండిపడ్డారు. కేసీఆర్ కంచంలో మిగిలిపోయిన దాన్ని తినే వెధవలు కూడా తనను విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతీకార రాజకీయాలు ఎన్నటికీ మంచిది కాదన్న రేవంత్.. తాను ఎలాంటి మనీలాండరింగ్ కు పాల్పడలేదని స్పష్టం చేశారు.