Asia cup: ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం.. ఆసియా కప్ మనదే!
- చివరి బంతి వరకు విజయం దోబూచులాట
- లక్ష్యం చిన్నదే అయినా తడబడిన భారత్
- చివరి వరకు పోరాడిన బంగ్లాదేశ్
ఆసియా కప్‌లో తమకు తిరుగులేదని భారత్ మరోమారు చాటి చెప్పింది. బంగ్లాదేశ్‌తో దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరికి భారత్‌దే పైచేయి అయింది.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ అద్భుత సెంచరీ (121) సాధించాడు. ఒక దశలో ప్రత్యర్థి జట్టు 300కు పైగా పరుగులు సాధిస్తుందని భావించారు. అయితే, భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. 120 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోని బంగ్లాదేశ్ ఆ తర్వాత మరో వంద పరుగులకే ఆలౌట్ అవడం గమనార్హం.
బంగ్లా బ్యాట్స్‌మెన్‌లలో సెంచరీ వీరుడు లిటన్ దాస్ తర్వాత చెప్పుకోదగ్గ స్కోరు చేసింది మెహిదీ హసన్ (32), సౌమ్య సర్కారు (33) మాత్రమే. మిగతా వారెవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, కేదార్ జాదవ్ 2 వికెట్లు తీసుకోగా, బుమ్రా, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 223 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (48), శిఖర్ ధవన్ (15) శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ వారిద్దరూ అవుటైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (2) కూడా నిరాశ పరచడంతో మ్యాచ్ భారత్ చేజారినట్టు కనిపించింది. ఈ క్రమంలో మాజీ సారథి ధోనీ, దినేశ్ కార్తీక్‌లు జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో భారత్ విజయం వైపు దూసుకుపోతున్నట్టు కనిపించింది.
ఈ క్రమంలో ధోనీ అవుటవడం, జాదవ్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగడంతో భారత జట్టు పీకలోతు కష్టాల్లో కూరుకుపోయింది. దీనికి తోడు బంగ్లా బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విజయంపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే, రవీంద్ర జడేజా (23), భువనేశ్వర్ కుమార్ (21) బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదురొడ్డి భారత్‌కు విజయాన్ని అందించారు.
చివరి ఓవర్లో భారత్ విజయానికి ఆరు పరుగులు అవసరం కాగా, వరుసగా 1,1,2,0,1 వచ్చాయి. చివరి బంతికి లెగ్ బై రావడంతో భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ 2, రెబెల్ హొస్సైన్ 2 వికెట్లు తీసుకోగా, నజ్ముల్ ఇస్లాం, మోర్తాజా, మహ్మదుల్లా చెరో వికెట్ తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సెంచరీ వీరుడు లిటన్ దాస్‌కు దక్కగా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును శిఖర్ ధవన్ అందుకున్నాడు.