khummela: మందు కొట్టకూడదు-మాంసం ముట్టకూడదు.. యూపీలో కుంభమేళా విధుల కోసం పోలీసులకు నిబంధనలు!
- ఏర్పాట్లను ప్రారంభించిన యూపీ ప్రభుత్వం
- మరో నాలుగు నెలల్లో కుంభమేళా
- ఇంటర్వ్యూలను మొదలుపెట్టిన పోలీసులు
ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో జరగనున్న కుంభమేళాకు అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్న వేళ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కుంభమేళాకు కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇక్కడ భద్రత కోసం అధికారులు ఏకంగా ఇంటర్వ్యూలు కూడా ప్రారంభించారు.
అలహాబాద్ లో వచ్చే ఏడాది జనవరి 15 నుంచి కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రజలతో మంచిగా వ్యవహరించే పోలీసులను ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం కొన్ని కండీషన్లు పెట్టారు. ఇక్కడ విధులు నిర్వహించాలనుకునే వారు శాకాహారులై ఉండాలి. అలాగే సిగరెట్, మద్యం వంటి అలవాట్లు ఉండరాదు. ఈ సుగుణాలకు తోడు పోలీస్ ఉన్నతాధికారులు వీరికి గుడ్ కండక్ట్(మంచి ప్రవర్తన, వ్యక్తిత్వం) ఉన్నట్లు సర్టిఫికెట్ అందజేయాలి. అప్పుడే సదరు పోలీసులను అలహాబాద్ కుంభమేళాలో విధులు నిర్వర్తించేందుకు అనుమతిస్తారు.
ఇందుకోసం ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులు పిలిభిత్, షాజహాన్ పూర్, బరేలీ, బదౌన్ జిల్లాల్లో సిబ్బందికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై అధికారులు ఇంకొన్ని కండీషన్లు కూడా పెట్టారు. అదేంటంటే కుంభమేళాలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది అలహాబాద్ వాసులై ఉండరాదు. కానిస్టేబుళ్ల వయసు 35 ఏళ్లు, హెడ్‌కానిస్టేబుల్ అయితే 40 ఏళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ అయితే 45 ఏళ్ల వయసు దాటకూడదు.