varavararao: వరవరరావుకు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. మరో నాలుగు వారాలు గృహనిర్బంధంలోనే!
- భీమా-కొరేగావ్ కేసులో తీర్పు
- సిట్ ఏర్పాటు అవసరం లేదన్న న్యాయస్థానం
- దిగువ కోర్టుల్లో సవాలు చేసుకోవచ్చని సూచన
విరసం నేత వరవరరావు సహా పౌర హక్కుల నేతలు సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్మన్ గంజాల్వెజ్, గౌతమ్ నవలఖాలకు సుప్రీంకోర్టు ఈ రోజు షాక్ ఇచ్చింది. వీరిని తక్షణం విడుదల చేయాలని ప్రముఖ చరిత్రకారిణి రొమీలా థాపర్ తో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. హక్కుల కార్యకర్తల గృహనిర్బంధాన్ని మరో నాలుగు వారాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ ల ధర్మాసనం స్పష్టం చేసింది.
గతేడాది మహారాష్ట్రలోని పుణెలో దళిత సంఘాలు ఎల్గర్ పరిషత్ సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం భీమా-కొరెగావ్ ప్రాంతంలో దళితులు, అగ్రవర్ణాల మధ్య జరిగిన గొడవల్లో తీవ్రమైన హింస చెలరేగింది. ఈ ఘటన నేపథ్యంలో ఐదుగురు హక్కుల కార్యకర్తలను పుణె పోలీసులు గత నెలలో అరెస్ట్ చేశారు. దీంతో వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం అరెస్టును గృహనిర్బంధంగా మార్చింది. తమ తీర్పుపై పిటిషనర్లు దిగువ కోర్టులకు వెళ్లవచ్చని సూచించారు.