Kadapa District: కడపలో ఒక్కటైన ఉప్పు-నిప్పు.. సుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య రాజీ ఫార్ములా!

  • రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు
  • కడప లోక్ సభ సీటు లక్ష్యంగా పావులు
  • ఇప్పటికే కుదిరిన రాజీ ఫార్ములా

కడప జిల్లా జమ్మలమడుగులో ఆది నారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాలు ఉప్పు-నిప్పుగా ఉన్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ పై గెలుపొందిన ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి టీడీపీలోకి రావడానికి ప్రయత్నించగా, టీడీపీలో ఉన్న రామసుబ్బారెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడాన్ని సుబ్బారెడ్డి వర్గీయులు అస్సలు అంగీకరించలేదు. దీంతో సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీతో పాటు ప్రభుత్వ విప్ పదవి కట్టబెట్టిన చంద్రబాబు.. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అయితే రాబోయే ఎన్నికల దృష్ట్యా టీడీపీ అధిష్ఠానం ప్రతిపక్ష నేత జగన్ కు సొంత జిల్లాలోనే షాక్ ఇచ్చేందుకు సిద్ధమయింది.

కడప లోక్ సభ స్థానాన్ని ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తున్న టీడీపీ.. అందుకు నారాయణ రెడ్డి-సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సిద్ధమయింది. ఇందులో భాగంగా ఇరువర్గాల మధ్య ఇప్పటికే రాజీ ఫార్ములా కుదిరిందని సమాచారం. దీని ప్రకారం ఆది నారాయణ రెడ్డి, సుబ్బారెడ్డిలో ఒకరు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా, మరొకరు కడప లోక్ సభ స్థానానికి పోటీ చేయనున్నారు.

గత ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానానికి పులివెందుల నుంచి 70,000 వరకూ మెజారిటీ వచ్చింది. ఇక జమ్మలమడుగులో అయితే ఈ సంఖ్య 50,000 వరకూ ఉంది. అంతేకాకుండా కడపలో వైసీపీకి దాదాపు 50 వేల వరకూ మెజారిటీ వచ్చింది.  నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి-సుబ్బారెడ్డి వర్గీయులను ఏకం చేస్తే కడపలో టీడీపీ అభ్యర్థి విజయం సులువు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

ఇటీవల పులివెందులకు కృష్ణా జలాల సరఫరా తర్వాత అక్కడ వైసీపీ ప్రాబల్యం తగ్గి టీడీపీకి ఆదరణ పెరిగిందని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు. దీనివల్ల ఈసారి కడపలో వైసీపీ మెజారిటీని భారీగా తగ్గించగలమని వ్యాఖ్యానిస్తున్నారు. పులివెందుల, కడపలో వైసీపీకి పడే ఓట్లను తగ్గించి, జమ్మలమడుగులో ఓటింగ్ ను పెంచగలిగితే టీడీపీ అభ్యర్థి విజయం నల్లేరుపై నడకేనని టీడీపీ నేతలు నమ్ముతున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News