flaight: సరస్సులోకి దూసుకుపోయిన విమానం.. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం!
- రన్ వే ను దాటి 150 మీటర్లు ముందుకు దూసుకుపోయిన విమానం
- మైక్రోనేషియన్ దీవుల్లో ఘటన
- 36 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది క్షేమం
పైలట్ తప్పిదమో... ప్రకృతి సహకరించలేదో గాని రన్‌వేపై ల్యాండ్ కావాల్సిన విమానం ఓ సరస్సులోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు అందులోని 36 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మైక్రోనేషియన్ దీవుల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి.
పాపువా న్యూ గునియా దేశానికి చెందిన ఎయిర్ నుగిని విమానం వీనో ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. పైలట్ తప్పిదమో, అతని అంచనా తప్పిందోగాని రన్ వే పై దిగాల్సిన విమానం అక్కడికి 150 మీటర్ల దూరంలో ఉన్న సరస్సులోకి దూసుకుపోయింది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు బోట్లు వేసుకుని విమానం వద్దకు వెళ్లి ప్రయాణికులను, సిబ్బందిని రక్షించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి విమానం నీటిలో మునిగిపోయింది.
విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో వర్షం కురుస్తుండడం. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండడం ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. రన్‌వే చివరి భాగాన్నివిమానం తాకడం వల్ల ఎగిరి సరస్సులోకి దూసుకుపోయిందని మరికొందరు చెబుతున్నారు. ఈ ఘటనపై ఎయిర్ నుగిని విచారణకు ఆదేశించింది.