Pawan Kalyan: అలా అయితే జగన్ సీఎం.. ముఖేశ్ అంబానీ పీఎం అయ్యేవారు: పవన్ కల్యాణ్
- గెలవడానికి డబ్బు కాదు ప్రజాబలం కావాలి
- ఓట్లు చీలిపోకూడదనే టీడీపీకి మద్దతిచ్చా
- నేను లోకేశ్‌లా ఆలోచించను
వేల కోట్ల రూపాయలు ఉంటే రాజకీయాలు చేయొచ్చని కొందరు అనుకుంటున్నారని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విమర్శించారు. ఒకవేళ అదే నిజమనుకుంటే వైసీపీ అధినేత జగన్ ఎప్పుడో సీఎం అయి ఉండేవారని, ముఖేశ్ అంబానీనో, లేదంటే టాటా, బిర్లానో దేశానికి ప్రధాని అయి ఉండేవారని పవన్ అన్నారు.- ఎన్నికల్లో గెలవాలంటే కావాల్సింది డబ్బు కాదని, ప్రజా బలమని అన్నారు. తనకు అది పుష్కలంగా ఉందని పవన్ పేర్కొన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, ఉంగుటూరు నియోజకర్గం గణపవరంలలో నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో తాను పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయన్న ఉద్దేశంతోనే టీడీపీకి మద్దతు ఇచ్చానని పవన్ చెప్పారు. కానీ తాను అనుకున్నది ఒకటి, అయింది మరొకటని అన్నారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నారని, సీఎంగా తొమ్మిదేళ్లు శాంతిభద్రతలను కాపాడారనే ఉద్దేశంతోనే చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. లోకేశ్‌లా తండ్రిని కేంద్రానికి పంపించి, తాను ముఖ్యమంత్రిని అయిపోవాలనుకోవడం లేదని పవన్ వ్యంగ్యంగా అన్నారు.