ILSF group: దీర్ఘకాలానికి సరిపడా నగదును సమకూరుస్తున్నాం: ఆర్‌బీఐ
- ప్రస్తుతం డబ్బు సరిపడా ఉంది
- 26 నాటికి రూ.1.88లక్షల కోట్ల నగదు
- 19న ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ నిర్వహించాం
ఇటీవల ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ గ్రూప్ రుణ సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో మార్కెట్‌లో నగదు కొరతపై సర్వత్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ ఈ రోజు ఒక ప్రకటనను విడుదల చేస్తూ, ప్రస్తుతం నగదు సరిపడా ఉందని స్పష్టం చేసింది. మార్కెట్ పరిస్థితులను బట్టి దీర్ఘకాలానికి సరిపడా నగదును సమకూరుస్తామని పేర్కొంది.
‘సెప్టెంబరు 26 నాటికి బ్యాంకుల వద్ద రూ.1.88 లక్షల కోట్ల నగదు ఉంది. ప్రస్తుతానికి బ్యాంకింగ్ వ్యవస్థలో డబ్బు సరిపడా ఉంది. దీర్ఘకాలం కోసం కూడా నగదును సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగానే సెప్టెంబరు 19న ఓపెన్ మార్కెట్ ఆపరేషన్(ఓఎంవో) నిర్వహించాం. నేడు మరోసారి ఈ సెషన్ చేపట్టబోతున్నాం. ఈ చర్యల ద్వారా మిగులు ద్రవ్యం పుష్కలంగా ఉంటుంది’’ అని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.