Telangana: రైస్ మిల్లుల సామర్థ్యం మేరకు సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయిస్తాం: అకున్ సబర్వాల్
- ధాన్యం కేటాయింపులో పారదర్శకంగా వ్యవహరించాలి
- కేటాయింపులో ఒక క్రమపద్ధతిని పాటించాలి
- రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించిన అకున్ సబర్వాల్
రైస్ మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ధాన్యం కేటాయిస్తామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించిన ఏర్పాట్లపై రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని పౌరసరఫరాల భవన్ లో నిర్వహించిన ఈ సమావేశంలో అకున్ సబర్వాల్ మాట్లాడుతూ, సీఎంఆర్ కోసం రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులో పారదర్శకంగా వ్యవహరించాలని, మిల్లుల సామర్థ్యం మేరకు ధాన్యం కేటాయింపులు జరపాలని ఆదేశించారు.
రెండు టన్నుల సామర్థ్యం ఉన్న మిల్లులకు 1000 మెట్రిక్ టన్నులు, నాలుగు టన్నులు, ఆరు టన్నుల సామర్థ్యం ఉన్న రైస్ మిల్లులకు వరుసగా 2000 మెట్రిక్ టన్నులు, 3000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించాలని, విద్యుచ్ఛక్తి వినియోగం కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ధాన్యం కేటాయింపులో రాష్ట్ర, జిల్లా మిల్లర్ల సంఘాలతో సంప్రదించి ఒక క్రమపద్ధతిని పాటించాలని, సెప్టెంబర్ 2016 నాటికి రీసైక్లింగ్, పీడీఎస్ బియ్యం దారి మళ్లింపు, క్రిమినల్ కేసులు, బ్లాక్ లిస్టుకావడం, 6ఏ కేసులు నమోదైన మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరపకూడదని, సీఎంఆర్ కోసం తీసుకున్న బియ్యాన్ని త్వరితగతిన ప్రభుత్వానికి అప్పగించాలని అకున్ సబర్వాల్ ఆదేశించారు.