USA: అమెరికా ఎఫెక్ట్.. ఇరాన్ ముడిచమురుకు గుడ్ బై చెప్పనున్న భారత్!
- నవంబర్ 4 వరకూ డెడ్ లైన్ పెట్టిన అమెరికా
- ఒప్పుకోకుంటే తమతో వ్యాపారం చేయలేరని స్పష్టీకరణ
- ఇప్పటికే అంగీకరించిన జపాన్, ఈయూ, దక్షిణకొరియా
అగ్రరాజ్యం అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గింది. ఇరాన్ నుంచి ఇంధన దిగుమతులను ఆపేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరించిన వేళ చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేసేందుకు అంగీకరించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, మంగళూరు రిఫైనరీలు కొత్తగా నవంబర్ నెలలో ముడిచమురు కోసం ఆర్డర్లు ఇవ్వలేదు. దీంతో భారత్ ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతులను ఆపేస్తుందని భావిస్తున్నారు.
నవంబర్ 4 నుంచి ఇరాన్ తో అన్ని దేశాలు చమురు కొనుగోళ్లు ఆపేయాలని అమెరికా కోరిన సంగతి తెలిసిందే. లేదంటే తమ మార్కెట్ లోని కంపెనీలతో ఆర్థిక లావాదేవీలను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఇరాన్ నుంచి చమురు దిగుమతులకు గుడ్ బై చెప్పాయి.