Kidari: వారిద్దరూ మరణించారంటున్న మావోలు... వారే కిడారి హత్యకు నేతృత్వం వహించారంటున్న పోలీసులు!
- కిడారి హత్యోదంతానికి కామేశ్వరి, రైను సూత్రధారులు
- వారిద్దరూ 2016లోనే మరణించారంటున్న పోలీసులు
- ఫొటోలు విడుదల చేయడంతో అయోమయం
గడచిన ఆదివారం నాడు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును కాల్చి చంపిన మావోయిస్టుల టీమ్ లో కామేశ్వరి అలియాస్ స్వరూప అలియాస్ చంద్రి, రైను అలియాస్ జలుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్ పాల్గొన్నారని పోలీసులు అంటుండగా, వారిద్దరూ రెండేళ్ల క్రితమే మరణించారని మావోలు గతంలోనే ప్రకటించారు. 2016 అక్టోబర్ 24న జరిగిన కోవర్టు దాడిలో స్వరూప, రైను సహా 27 మంది అమరులయ్యారని, అదే నెల 26న మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట మీడియాకు ఓ లేఖ విడుదలైంది.
కాగా, ఇప్పుడు వీరిద్దరే లివిటిపుట్టు ఆపరేషన్ కు నాయకత్వం వహించారని చెబుతూ వారి ఫొటోలను పోలీసులు విడుదల చేయడం అయోమయానికి గురి చేస్తోంది. కిడారి కిడ్నాప్, హత్యోదంతంలో పాల్గొన్న మావోయిస్టుల్లో ముగ్గురిని గుర్తించినట్టు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక రైను, స్వరూపలు ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని మావోయిస్టులు మరోసారి స్పష్టం చేస్తేనే ఈ కేసులో కీలక చిక్కుముడి వీడుతుందని భావిస్తున్నారు.