Asia cup: కీలక పోరులో చేతులెత్తేసిన పాక్.. ఫైనల్లో భారత్-బంగ్లా ఢీ!

  • బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాక్
  • ఒక్క పరుగు తేడాతో శతకం కోల్పోయిన ముష్ఫికర్ రహీమ్
  • శుక్రవారం భారత్-బంగ్లా మధ్య ఫైనల్ పోరు

చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతులెత్తేసింది. ఆసియాకప్‌లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో ఓటమి పాలై నిష్కృమించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడింది. బంగ్లా బౌలర్ల దెబ్బకు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసి లక్ష్య ఛేదనలో వెనుకబడింది. ఇమాముల్ హక్ 83 పరుగులతో కాస్తయినా ఆదుకున్నాడు కాబట్టే పాక్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లేదంటే మరింత భారీ తేడాతో ఓటమి పాలై ఉండేది.  

నిజానికి 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడిన పాక్‌ను ఓపెనర్ ఇమాముల్ హక్ (83), షోయబ్ మాలిక్ (30) ఆదుకున్నారు. దీంతో ఆట నెమ్మదిగా పాక్‌ వైపు మొగ్గుచూపినట్టు కనిపించింది. అయితే, 85 పరుగుల వద్ద షోయబ్ మాలిక్ అవుటవడంతో పాక్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత అసిఫ్ అలీ (31)తో కలిసి ఇమాముల్ హక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, అసిఫ్ అలీ, ఆ తర్వాత ఇమాముల్ హక్, హసన్ అలీ (8), మహమ్మద్ నవాజ్ (8) ఇలా వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో పాక్ 37 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు తీసి బంగ్లాదేశ్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు.  

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ముష్ఫికర్‌ రహీమ్ (99)‌, మహమ్మద్ మిథున్‌ (60)ల పోరాటంతో బంగ్లాదేశ్ 239 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాట్స్‌మెన్‌లలో ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్ 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను దెబ్బతీశాడు. కాగా, ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న ముష్ఫికర్ రహీమ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. శుక్రవారం జరగనున్న టైటిల్ పోరులో భారత్-బంగ్లాదేశ్‌లు తలపడున్నాయి.

Asia cup
India
Pakistan
Bangladesh
Dubai
Mustafizur Rahman
Mushfiqur Rahim
  • Loading...

More Telugu News