gunt: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో రూ.65 కోట్లతో తల్లీబిడ్డల ఆసుపత్రి నిర్మాణం
- నిర్మాణానికి ముందుకొచ్చిన ఎన్ఆర్ఐలు
- వీళ్లందరూ జీజీఎంహెచ్సీ పూర్వ విద్యార్ధులే
- ప్రభుత్వ వాటా రూ.35 కోట్లు..వారి వాటా రూ.30 కోట్లు
గుంటూరు మెడికల్ కళాశాల అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (జిమ్ కానా) సభ్యులు మరోసారి తమ పెద్ద మనసును చాటుకున్నారు. గతంలో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో పొదిలి ప్రసాద్ బ్లాక్ నిర్మించారు. ఇపుడు తల్లీ బిడ్డల ఆసుపత్రి నిర్మాణానికి నడుంబిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. రూ.65 కోట్లతో నిర్మాణమవుతున్న తల్లీ బిడ్డల ఆసుపత్రి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు, ప్రవాసాంధ్రులు రూ.30 కోట్లు భరించనున్నారు. ఇందులో భాగంగా సచివాలయంలోని అయిదో బ్లాక్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సమక్షంలో ఒప్పంద పత్రాలను ఈరోజు మార్పిడి చేసుకున్నారు.
ఈ సందర్భంగా పూనం మాలకొండయ్య మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తరవాత గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల కీలకంగా మారిందని, ఇటువంటి సమయంలో తల్లీ బిడ్డల ఆసుపత్రి నిర్మాణానికి ప్రవాసాంధ్రులైన జీజీఎచ్ఎంసీ పూర్వ విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని, మరెందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. జిమ్ కానా సభ్యులు మాదిరిగా ఆంధ్ర మెడికల్, తిరుపతి మెడికల్ తదితర కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు కూడా ముందుకొస్తున్నారని, గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తల్లీబిడ్డల ఆసుపత్రి నిర్మాణం వల్ల 600 పడకలు అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు.
కాల పరిమితిని నిర్దేశించుకుని తల్లీ బిడ్డల ఆసుపత్రి నిర్మించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ను, డీఎంఈ డాక్టర్ బాబ్జీని ఆదేశించారు.కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ, గతంలోనూ జిమ్ కానా సభ్యులు గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పొదిలి ప్రసాద్ బ్లాక్ ను తమ సొంత నిధులతో నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు. మరోసారి తమ దాతృత్వం చాటుకుని తల్లీబిడ్డల ఆసుప్రతి నిర్మాణానికి ముందుకురావడం అభినందనీయమని అన్నారు.
జిమ్ కానా సభ్యులు లోకేశ్వరరావు, రామ కోటేశ్వరరావు కోయ మాట్లాడుతూ, గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పడకల కొరతను దృష్టిలో పెట్టుకుని తల్లీ బిడ్డల ఆసుపత్రి నిర్మాణానికి ముందుకొచ్చామని, ఈ ఆసుప్రతిని గుంటూరు జిల్లా వాసులు, సిబ్బంది తమ సొంతింటిగా భావించాలని కోరారు. తల్లీ బిడ్డల ఆసుపత్రి నిర్మాణానికి అనుమతిచ్చిన సీఎం చంద్రబాబునాయుడుకు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యకు, గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సమక్షంలో జిమ్ కానా సభ్యులు, ప్రభుత్వం తరఫున డీఎంఈ డాక్టర్ బాబ్జీ, గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ రాజునాయుడు ఒప్పంద ప్రతాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు హనుమంతరావు, కృష్ణమూర్తి, బాలభరత్ తదితరులు పాల్గొన్నారు.