ys jagan: గత ఎన్నికల సమయంలో చంద్రబాబుకు, లోకేశ్ కు జగన్ అంటే భయం ఉంది!: పవన్ కల్యాణ్
- నాడు ఓట్లు చీలకుండా చూడాలని బాబు నన్ను కోరారు
- 2014 ఎన్నికల్లో వాళ్లిద్దరికీ జగన్ అంటే భయం ఉంది
- జనసైనికులు ఇచ్చిన ధైర్యంతోనే వారు గెలిచారు
2014 ఎన్నికల్లో ఓట్లు చీలకుండా చూడాలని చంద్రబాబునాయుడు తనను కోరారని, అందుకే, నాడు టీడీపీకి మద్దతిచ్చానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘అప్పుడు చెప్పాను... శాంతి భద్రతలు కాపాడటం చాలా ముఖ్యం అని. అలాగే అందరికీ సమాన అవకాశాలు కల్పించమని, మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వమని కోరాను. అవేవీ ముఖ్యమంత్రి నెరవేర్చలేదు.
2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు గారు ఇంటికి భోజనానికి పిలిచి ‘ఈ ఎన్నికల్లో ఒకవేళ గెలవకపోతే.. తదుపరి మనం కలిసి పని చేయాలి’ అని నాతో చెప్పారు. అప్పటి ఎన్నికల్లో వారికి, వారి అబ్బాయికి జగన్ అంటే భయం ఉంది. జనసైనికులు ఇచ్చిన ధైర్యంతోనే వారు గెలిచారు’ అని పవన్ అన్నారు.
ఈ సందర్భంగా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఆయన నిప్పులు చెరిగారు. ‘న్యూయార్క్ లో కూర్చొని దెందులూరులో వీధి లైట్లు వెలుగుతున్నాయో లేదో చెప్పే ముఖ్యమంత్రి గారికి ఈ ఎమ్మెల్యే ఆగడాలు అన్నీ ఎప్పటికప్పుడు తెలిసిపోతుంటాయి. కానీ కట్టడి చేసే ధైర్యం ఆయనకి గానీ, వారి అబ్బాయి లోకేశ్ కి గానీ లేవు’ అని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.