Adhar: ఆధార్ అనుసంధానంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు నేడు
- తప్పనిసరి చేయరాదంటూ 27 పిటిషన్లు దాఖలు
- వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని ఆందోళన
- అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నఅత్యున్నత న్యాయస్థానం
భారతీయుల యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఆధార్ అనుసంధానంపై సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది. ప్రతి సందర్భంలోనూ ఆధార్ అనుసంధానం తప్పనిసరి అంటున్న కేంద్రప్రభుత్వం అందులో ఉన్న వ్యక్తిగత సమాచారం భద్రతపై స్పష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాల్లేకపోవడంతో ‘ఆధార్ అనుసంధానం’ను తప్పనిసరి చేయొద్దంటూ అత్యున్నత న్యాయస్థానంలో 27 పిటిషన్లు దాఖలయ్యాయి.
వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా ఏ ప్రయోజనం పొందాలన్నా 12 అంకెల ఆధార్ సంఖ్యను తప్పనిసరి చేసింది. మిగిలిన గుర్తింపు పత్రాలన్నింటినీ పక్కన పెట్టేసింది. దీనిపై పలువురి నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. ‘ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించి డిజిటలీకరించడం వారి వ్యక్తిగత గోప్యతకు ఇబ్బందికరం. సరైన భద్రత లేని పరిస్థితుల్లో సమాచారం సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో పడితే దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా ఉంది’ అంటూ తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అధార్ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను స్వీకరించిన సుప్రీం కోర్టు గత జనవరిలో 38 రోజులపాటు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంతో విచారించింది. దీనిపై ధర్మాసనం బుధవారం తీర్పును వెలువరించనుంది.