Barclays: బార్ క్లేస్ ధనవంతుల జాబితా... ఇండియాలో టాప్ ముఖేష్ అంబానీ... జాబితాలో నారా భువనేశ్వరి!
- రూ.3,71,000 కోట్ల సంపదతో ముఖేష్ అంబానీ
- రూ. 1000 కోట్లకు పైగా ఆస్తులున్న వారి సంఖ్య 831
- జాబితాలో 233 మందితో ముంబై అగ్రస్థానం
- తెలుగు రాష్ట్రాల నుంచి 46 మందికి చోటు
ఇండియాలో అత్యంత సంపన్నుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి నిలిచారు. తాజాగా బార్ క్లేస్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ –2018 విడుదల కాగా, దాదాపు రూ.3,71,000 కోట్ల సంపదతో ముఖేష్ తొలి స్థానంలో ఉన్నారు. ఇండియాలో రూ. 1000 కోట్లకు పైగా సంపద ఉన్న వారి జాబితాను బార్ క్లేస్ విడుదల చేసింది. గత సంవత్సరం ఈ జాబితాలో 617 మంది ఉండగా, ఈ సంవత్సరం వారి సంఖ్య 831కి పెరిగిందని, హురున్ రిపోర్ట్ ఇండియా ఎండీ రెహ్మాన్ జునైద్ వెల్లడించారు. వీరందరి సంపదా కలిపితే 719 బిలియన్ డాలర్లని ఆయన అన్నారు.
సంపన్నులు అత్యధికంగా ఉన్న నగరంగా ముంబై నిలిచింది. ముంబైలో రూ.1,000 కోట్లకన్నా అధికంగా సంపదున్న వారి సంఖ్య 233. ముంబై తరువాత న్యూఢిల్లీ 163 మంది సంపన్నులతో రెండో స్థానంలో ఉండగా, బెంగళూరు 70 మందితో మూడో స్థానంలో ఉంది. ఒరావెల్ స్టేస్ (ఓయో రూమ్స్) వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (24 ఏళ్లు), ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న అత్యంత పిన్న వయస్కుడు.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఈ జాబితాలో 46 మందికి చోటు లభించింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ షేర్ హోల్డర్ గా ఉన్న ఆమె సంపద రూ. 1,200 కోట్లని బార్ క్లేస్ వెల్లడించింది. ఇంకా ఈ జాబితాలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రమోటర్లు పీ పిచ్చిరెడ్డి, పీవీ కృష్ణారెడ్డి, హెటిరో డ్రగ్స్ ప్రమోటరు బీ పార్థసారథి రెడ్డి టాప్–3 స్థానాల్లో నిలిచారు. వీరితో పాటు మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, దివీస్ ల్యాబ్స్ వాటాదారులు నీలిమా మోటపర్తి, దివి సచ్ఛంద్ర కిరణ్, నూజివీడు సీడ్స్ అధినేత మండవ ప్రభాకరరావు తదితరులు ఉన్నారు.