Jammu And Kashmir: ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్.. అమరుడైన ‘సర్జికల్ స్ట్రైక్స్’ హీరో!
- సోమవారం నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల కాల్పులు
- లాన్స్ నాయక్ సందీప్ సింగ్ శరీరంలోకి బుల్లెట్లు
- ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల హతం
రెండేళ్ల క్రితం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం నిర్వహించిన మెరుపు దాడుల్లో కీలక పాత్ర పోషించిన లాన్స్ నాయక్ సందీప్ సింగ్ అమరుడయ్యారు. జమ్ముకశ్మీర్‌లోని తాంగ్ధర్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన అసువులు బాశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. సందీప్ సింగ్ మృతదేహానికి శ్రీనగర్‌లోని బదామీ బాగ్ కంటోన్మెంట్‌లో సైనిక ఉన్నతాధికారులు నివాళులర్పించారు.
ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సందీప్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి శరీరంలోకి తూటాలు దూసుకెళ్లాయి. వెంటనే అతడిని శ్రీనగర్‌లోని ‘92 బేస్ ఆసుపత్రి’కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సందీప్ సింగ్ తుదిశ్వాస విడిచాడు. సైనిక ఉన్నతాధికారులు నివాళులు అర్పించిన అనంతరం సందీప్ మృతదేహాన్ని అతడి స్వస్థలమైన పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని కోట్లా ఖుర్దు గ్రామానికి పంపారు.