dubai: చికెన్ బిర్యానీ కావాలన్న ఉదర కేన్సర్ బాధితుడు.. సర్జరీకి వెళ్లేముందు ఆబగా లాగించిన వైనం!
- దుబాయ్ లో ఇంజనీర్ గా చేస్తున్న గులాం అబ్బాస్
- ఉదర కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న వైనం
- కేన్సర్ కణాలున్న ప్రాంతాన్ని తొలగిస్తామన్న వైద్యుడు
ఉదర కేన్సర్ తో బాధపడుతున్న ఓ రోగి కి కేన్సర్ కణాలు వున్న భాగాన్ని తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆ రోగికి వైద్యులు చెప్పారు. చివరిసారిగా తాను బిర్యానీ తింటానని ఆ తర్వాత సర్జరీ చేయాలని పేషెంట్ కోరాడు. ఇందుకు, వైద్యులు కూడా ‘సరే’ అన్నారు. ఈ సంఘటన దుబాయ్ లో జరిగింది.
అక్కడ ఇంజనీర్ గా పని చేస్తున్న గులాం అబ్బాస్ కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురయ్యాడు. వాంతులు అవుతూ, బరువు తగ్గుతుండటంతో వైద్యుడిని సంప్రదించాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఉదర కేన్సర్ మూడో స్టేజ్ లో ఉన్నట్టు తేలింది. దీంతో, కేన్సర్ కణాలు ఉన్న ప్రాంతాన్ని శస్త్ర చికిత్స ద్వారా తొలగించాల్సి వస్తుందని చెప్పారు. దీంతో, ఎంతో ఆవేదనకు గురైన అబ్బాస్.. తనకు చికెన్ బిర్యానీ అంటే ఎంతో ఇష్టమని, చివరిసారిగా బిర్యానీ తింటానని, అందుకు, అనుమతివ్వాలని ఆ వైద్యుడిని కోరాడు.
అందుకు, వైద్యుడు ‘సరే’ అన్నాడు. దీంతో, అబ్బాస్ భార్య ఎంతో రుచికరంగా బిర్యానీ తయారు చేసి ఆసుపత్రికి తీసుకెళ్లగా భర్త ఆబగా లాగించేశాడు. ఉదర కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగికి కేన్సర్ కణాలు ఉన్న ప్రాంతాన్ని తొలగిస్తే, ఇకపై ఏమీ తినలేరని కాదని, ఎక్కువ కారంగా ఉన్న ఆహారపదార్థాలు తినకూడదని, తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటూ ఉండాలని అక్కడి వైద్యులు చెప్పారు.