jagityal: మాకు ఇష్టమైన బీర్లను అమ్మడం లేదు సారూ.. కాస్త చూడండి!: జిల్లా కలెక్టర్ కు బీరు ప్రియుడి ఫిర్యాదు
- స్వేచ్ఛతో కూడిన కొనుగోలు ఒక ప్రాథమిక హక్కు
- మద్యం విక్రయదారులు సిండికేట్ గా ఏర్పడి లోకల్ బీర్లు అమ్ముతున్నారు
- అన్ని బ్రాండ్ల బీర్లూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోండి
ఇది ఒక బీరు ప్రియుడి ఆవేదన. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను కాలరాస్తున్నారనే ఆక్రోశం. జగిత్యాలతో పాటు మరికొన్ని మండలాలలో బ్రాండెడ్ బీర్లు అమ్మడం లేదని, లోకల్ లేదా నాసిరకం బీర్లను మాత్రమే అమ్ముతున్నారని సూర్యం అనే బీరు ప్రియుడు వాపోయాడు. బ్రాండెడ్ బీరును చూసి చాలా కాలం అయిందని... మద్యం విక్రయదారులు సిండికేట్ గా ఏర్పడి నాసిరకం బీర్లు అమ్ముతున్నారని మండిపడ్డాడు. జగిత్యాల జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజావాణి కార్యమంలో ఏకంగా ఈ మేరకు ఫిర్యాదు చేశాడు.
తాము ఎంతో ఇష్టంగా తాగుతున్న బీర్ల వల్ల ప్రభుత్వానికి ఎంతో ఆదాయం సమకూరుతోందని... కానీ, తమకు బ్రాండెడ్ బీర్లు అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులో సూర్యం పేర్కొన్నాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం సంక్రమించిన ప్రాథమిక హక్కుల్లో... స్వేచ్ఛతో కూడిన కొనుగోలు కూడా ఒక హక్కేనని ప్రస్తావించాడు. తమ ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూడాలని... తమకు ఇష్టమైన బీర్ బ్రాండ్లన్నీ అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ కు విన్నవించాడు. తమకు నచ్చిన బీర్లను అందుబాటులో లేకుండా చేస్తున్న మద్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.