Pakistan: పాకిస్థాన్ లో వరదలు వచ్చేలా చేసిన భారత్... 'డాన్' ప్రత్యేక కథనం!
- రావి, చీనాబ్, సట్లెజ్ నదుల నుంచి నీటిని విడుదల చేసిన భారత్
- నీట మునిగిన వందలాది ఎకరాల పంట
- పర్వతాల్లో వర్షాలు పడి వుండవచ్చన్న వాతావరణ శాఖ
ఎగువన ఉన్న రిజర్వాయర్ ల నుంచి ఒక్కసారిగా నీటిని వదలడం ద్వారా భారత్ ప్రతీకార చర్యలకు దిగుతోందని, దీని ఫలితంగా చాలా గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయని పాకిస్థాన్ కేంద్రంగా ప్రచురితమవుతున్న 'డాన్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వాతావరణ విభాగం చీఫ్ ముహమ్మద్ రియాజ్ ఈ విషయాన్ని తమకు వెల్లడించారని చెబుతూ, ఇండియా తన రిజర్వాయర్లలో భారీగా నీటిని నిల్వ ఉంచుకుందని, వాటినిప్పుడు ఒక్కసారిగా విడుదల చేసిందని ఆరోపించింది.
ఈ వార్త కలకలం రేపడంతో, వివరణ ఇచ్చిన పీఎండీ (పాకిస్థాన్ వాతావరణ శాఖ), భారత్ నీటిని వదిలినట్టుగా తమకు సమాచారం లేదని, పర్వత ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వరద వచ్చి వుండవచ్చని అధికారులు స్పష్టత ఇచ్చారు. రావి, చీనాబ్, సట్లెజ్ నదుల్లో ప్రస్తుతం భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఈ వరద కారణంగా నుల్లా డేక్, షకర్ ఘర్ రీజియన్లలో వందలాది ఎకరాల పంట నీట మునిగింది.
కాగా, 'జియో న్యూస్' ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేస్తూ, పాకిస్థాన్ తో భారత్ చర్చలను రద్దు చేసుకున్న రోజే, రిజర్వాయర్ల నుంచి నీరు విడుదలైందని, ఒకేసారి నీరు నదుల్లోకి వచ్చిందని పేర్కొంది. తమ చర్యలతో పాకిస్థాన్ కు సర్ ప్రైజ్ ఇస్తామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఈ ఆకస్మిక వరదలకు, రావత్ వ్యాఖ్యలకూ లింకు పెట్టింది. పంజాబ్ ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు తెలిపింది.