Upasana: ఫోర్బ్స్ తాజా జాబితా... శక్తిమంత సంపన్నుల్లో ఉపాసన, సింధు!

- 'టైకూన్స్ ఆఫ్ టుమారో' పేరిట విడుదల
- కుటుంబ నేపథ్యం, వారి వ్యాపకం పరిగణనలోకి తీసుకుని జాబితా
- జాబితాలో కరణ్ అదానీ, అనన్య బిర్లా, ఆశ్ని బియానీ తదితరులకూ చోటు
ఉజ్వల భవిష్యత్తు ఉన్న శక్తిమంతమైన సంపన్నుల జాబితాలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన, ఒలంపిక్ పతక విజేత పీవీ సింధులకు స్థానం లభించింది. వ్యాపారం, వాణిజ్యం, నటన, క్రీడలకు సంబంధించి, ఇండియాకు చెందిన 22 మంది యువ శక్తిమంతుల జాబితాను 'టైకూన్స్ ఆఫ్ టుమారో' పేరిట 'ఫోర్బ్స్ ఇండియా' విడుదల చేసింది.

ఈ జాబితాలో, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కరణ్ అదానీ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ ఈడీ అనంత్ గోయెంకా, ఫ్యూచర్ కన్స్యూమర్ ఎండీ ఆశ్ని బియానీ, బిర్లా వారసురాలు, అనన్య బిర్లా తదితరులకు కూడా స్థానం లభించింది. వీరితో పాటు యస్ బ్యాంక్ సీఈఓ రాణా కపూర్ కుమార్తె రాధా కపూర్, పార్లే ఆగ్రోకు చెందిన నదియా చౌహాన్, లోధా గ్రూప్ నకు చెందిన అభిషేక్ లోధా, క్లియర్ టాక్స్ ఫౌండర్ అర్చిత్ గుప్తా కూడా చోటు దక్కించుకున్నారు.