KTR: ఏ అమరుడు చెప్పాడని వారితో కోదండరామ్ పొత్తు పెట్టుకున్నారు?: మంత్రి కేటీఆర్
- నాడు యువత చనిపోవడానికి కారణం కాంగ్రెస్, టీడీపీ
- అది మహాకూటమి కాదు స్వాహా కూటమి
- ఈ కూటమి అధికారంలోకొస్తే అమరావతికి తెలంగాణ ప్రజలు బానిసలే!
తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నర్సంపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈరోజు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకున్నారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో యువత అమరులు కావడానికి కారణమైన వారితో ఆ పార్టీ పొత్తు పెట్టుకుందని, ఏ అమరుడు చెప్పాడని కాంగ్రెస్, టీడీపీతో కోదండరామ్ పొత్తు పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు యువత చనిపోవడానికి కారణం కాంగ్రెస్, టీడీపీ లు కాదా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని మర్యాదగా ఇచ్చిందా? వీపు చింతపండు అవుతుందనే భయంతోనే ‘తెలంగాణ’ ఇచ్చిందని అన్నారు.
కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు అమనుతులు ఇవ్వొద్దని కేంద్రానికి చంద్రబాబునాయుడు ముప్పై లేఖలు రాశారని, అలాంటి చంద్రబాబుతో కోదండరామ్ ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలని ఏర్పడ్డ మహాకూటమిపై ఆయన విమర్శలు చేశారు. అది మహాకూటమి కాదని స్వాహా కూటమి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పొరపాటున ఈ కూటమి అధికారంలోకొస్తే అమరావతికి తెలంగాణ ప్రజలు బానిసలుగా ఉండాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్న, ప్రజలకు న్యాయం జరగాలన్న మళ్లీ టీఆర్ఎస్సే అధికారంలోకి రావాలని కేటీఆర్ అన్నారు.
అలాంటి చంద్రబాబుతో ఎలా పొత్తుపెట్టుకుంటారు?
చంద్రబాబు ఏపీ సీఎం అని, సహజంగా ఆ రాష్ట్ర ప్రయోజనాల గురించే ఆయన ఆలోచిస్తారని, అలాంటి వ్యక్తితో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, తెలంగాణ జన సమితి కోదండరామ్ ఎలా పొత్తుపెట్టుకుంటారని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులను కాల్చి చంపిన రాబందులు ఒక్కటయ్యాయంటూ కాంగ్రెస్, టీడీపీలపై ఆయన విరుచుకుపడ్డారు. మహాకూటమికి ఓట్లేసి ఢిల్లీ గులామ్ లుగా.. అమరావతికి బానిసలుగా ఉందామా? టీఆర్ఎస్ కు ఓటేసి రాజులుగా ఉందామా? అని కేటీఆర్ ప్రశ్నించారు.