RS.5000 CRORES: మరో విజయ్ మాల్యా.... రూ.5 వేల కోట్లు మోసం చేసి విదేశాలకు చెక్కేసిన భారతీయుడు!
- స్టెర్లింగ్ బయోటెక్ ఓనర్ మాయాజలం
- నైజీరియాకు పారిపోయిన నితిన్
- ఇంటర్ పోల్ సాయం కోరనున్న భారత్
వ్యాపారవేత్త విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తరహాలోనే మరో వ్యాపారవేత్త ప్రభుత్వ రంగ బ్యాంకులకు షాకిచ్చాడు. ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న స్టెర్లింగ్ బయోటెక్ అధినేత నితిన్ సందేశర భారత్ నుంచి నైజీరియాకు చెక్కేశాడు. ఇప్పటికే సీబీఐతో పాటు ఈడీ కేసులు ఉన్నప్పటికీ నితిన్ భారత్ నుంచి చల్లగా జారుకోవడం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది.
గుజరాత్ కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో నితిన్ తో పాటు కంపెనీలో భాగస్వాములుగా ఉన్న అతని కుటుంబ సభ్యులపై సీబీఐ, ఈడీలు కేసును నమోదుచేశాయి. దీంతో విచారణను తప్పించుకునేందుకు నితిన్ విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. తొలుత నితిన్ ను దుబాయ్ లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదనీ, ఇప్పటికే నితిన్ కుటుంబం నైజీరియాకు వెళ్లిపోయిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. బ్యాంకుల నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న నితిన్ ఈ మొత్తాన్ని 300 డొల్ల కంపెనీల (ఎక్కడా ఆఫీస్ ఉండదు.. కేవలం కాగితాల మీదే కనపడతాయి) ద్వారా దేశవిదేశాల్లోని అకౌంట్లలోకి అక్రమంగా మళ్లించాడని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పటికే రూ.4,700 కోట్ల విలువైన స్టెర్లింగ్ బయోటెక్ ఆస్తులను జప్తు చేసింది. కాగా, ప్రస్తుతం నైజీరియాలో తలదాచుకున్నారని భావిస్తున్న నితిన్ కుటుంబాన్ని భారత్ కు రప్పించేందుకు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులను జారీచేసే అవకాశముందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నైజీరియాతో భారత్ కు ఖైదీల అప్పగింత ఒప్పందం లేనందున, వీరి అప్పగింత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.